10.2-763-వ.
ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును, రాజలోకంబునకు బంధమోక్షణంబును గావించి, వాయునందన వాసవనందనులుం దానును జరాసంధతనయుం డగు సహదేవుండు సేయు వివిధంబు లగు పూజలు గైకొని, యతని నుండ నియమించి, యచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల నింద్రప్రస్థపురంబునకుం జనుదెంచి, తద్ద్వార ప్రదేశంబున విజయశంఖంబులు పూరించినఁ బ్రతిపక్ష భయదంబును, బాంధవ ప్రమోదంబును నగు నమ్మహాఘోషంబు విని, పౌరజనంబులు జరాతనయు మరణంబు నిశ్చయించి సంతసిల్లిరి; వారిజాక్షుండును భీమసేన పార్థులతోఁ బురంబు ప్రవేశించి ధర్మనందనునకు వందనం బాచరించి, తమ పోయిన తెఱంగును నచ్చట జరాసంధుని వధియించిన ప్రకారంబును సవిస్తరంబుగా నెఱింగించిన నతండు విస్మయవికచలోచనంబుల నానందబాష్పంబులు గురియ, నమ్మాధవు మాహాత్మ్యంబునకుఁ దమ యందలి భక్తి స్నేహ దయాది గుణంబులకుం బరితోషంబు నొందుచుఁ గృష్ణునిం జూచి యిట్లనియె.
భావము:
అలా శ్రీకృష్ణుడు జరాసంధ సంహారం, రాజులందరినీ విడిపించుట నిర్వహించాడు. భీముడు అర్జునుడు తాను జరాసంధుడి కుమారుడు సహదేవుడు చేసిన పూజలను స్వీకరించారు. పిమ్మట, బయలుదేరి భీమార్జున సమేతుడై ఇంద్రప్రస్థపురం చేరాడు. పుర ముఖద్వారంలో వారు విజయశంఖాలు పూరించారు. శత్రు భీకరములు, బంధు ప్రీతికరములు అయిన ఆ విజయసూచకాలైన ఆ శంఖధ్వనులను విని, పౌరులందరూ జరాసంధుడు మరణించాడని గ్రహించి సంతోషించారు. శ్రీకృష్ణుడు భీమార్జున సహితంగా ధర్మరాజును దర్శించి నమస్కారం చేసి, తాము మగధకు వెళ్ళిన వృత్తాంతం అక్కడ జరిగిన జరాసంధ సంహారాది సర్వం వివరంగా నివేదించాడు. కన్నులలో ఆనందబాష్పాలు పొంగిపొరలుతుండగా కృష్ణుడికి తమమీద గల స్నేహ వాత్సల్య కారుణ్యాది గుణాలకు సంతోషిస్తూ ధర్మరాజు ఈ విధంగా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=763
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment