Wednesday, October 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౭౨(372)

( రాజసూయంబు నెఱవేర్చుట ) 

10.2-779-చ.
ఇతఁడె యితండు గన్ను లొకయించుక మోడ్చిన నీ చరాచర
స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్
వితతములై జనించుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ
క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్?
10.2-780-ఉ.
ఈ పురుషోత్తమున్, జగదధీశు, ననంతుని, సర్వశక్తుఁ, జి
ద్రూపకు, నగ్రపూజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‌
వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్,
శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్?" 

భావము:
అటువంటి ఈ శ్రీకృష్ణుడు కనుక, కన్నులు కొద్దిగా మూసుకున్నాడంటే ఈ చరాచర ప్రపంచమంతా నశిస్తుంది. కన్నులు విప్పిచూస్తే ఈలోకాలన్నీ జనిస్తాయి. యజ్ఞ ఫలాన్ని ప్రసాదించే ప్రభువు, ప్రభవిష్ణుడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఐన శ్రీకృష్ణుడే ఈ అగ్రపూజకు అర్హుడు. ఇతడు కాకపోతే మరెవ్వరు తగినవారు కాగలరు? ఓ రాజా! పురుషోత్తముడు, సకలలోకాధిపతి, అనంతుడు సమస్తశక్తులు కలవాడు, చిద్రూపుడు అయిన శ్రీకృష్ణుడిని ప్రప్రథమంగా పూజించి సంతోషింప చేస్తే సమస్త లోకాలూ సంతృప్తి పొందుతాయి. కాబట్టి, వేలమాటలు ఎందుకు, నీవు ఆలస్యం చేయకుండా అన్యధా ఆలోచించకుండా ఈ లక్ష్మీపతికి, శ్రీకృష్ణుడికి అగ్ర పూజ చెయ్యి.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=59&Padyam=780 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments: