Friday, October 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౬౧(361)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-751-సీ.
అవధరింపుము మాగధాధీశ్వరుఁడు మాకు-
  బరమబంధుఁడు గాని పగయకాఁడు
ప్రకటిత రాజ్యవైభవ మదాంధీభూత-
  చేతస్కులము మమ్ముఁ జెప్ప నేల?
కమనీయ జలతరంగముల కైవడి దీప-
  శిఖవోలెఁ జూడ నస్థిరములైన
గురుసంపదలు నమ్మి పరసాధనక్రియా-
  గమ మేది తద్బాధకంబు లగుచుఁ
10.2-751.1-తే.
బరగు నన్యోన్య వైరానుబంధములను
బ్రజలఁ గారించుచును దుష్టభావచిత్తు
లగుచు నాసన్న మృత్యుభయంబు దక్కి
మత్తులై తిరుగుదురు దుర్మనుజు లంత.
10.2-752-చ.
కడపటిచేఁత నైహికసుఖంబులఁ గోల్పడి రిత్త కోర్కి వెం
బడిఁ బడి యెండమావులఁ బిపాసువులై సలిలాశ డాయుచుం
జెడు మనుజుల్‌ భవాబ్ధిదరిఁ జేరఁగలేక నశింతు; రట్టి యా
యిడుమలఁ బొందఁజాలము రమేశ! త్రిలోకశరణ్య! మాధవా! 

భావము:
వినవయ్యా శ్రీకృష్ణా! జరాసంధుడు మా దగ్గర బంధువే కాని శత్రువేం కాదు. రాజ్యవైభవం అనే మదాంధులమైన మా గురించి చెప్పటం అనవసరం. దుర్జనులు మనోఙ్ఞమైన నీటి అలలలాగా, దీపశిఖలలాగా చంచలములు ఐన సిరిసంపదలు శాశ్వతాలని నమ్మి, పరానికి సంబంధించిన కార్యకలాపాలను పరిత్యజించుతారు; పరస్పరం విరోధాలను పెంచుకుంటూ దుష్ఠులు అయి, ప్రజలను బాధిస్తూ ఉంటారు; మరణభయాన్ని మరచిపోయి, పొగరుబోతులై ప్రవర్తిస్తారు. ఓ మాధవా! లక్ష్మీపతీ! త్రిలోకశరణ్యా! అట్టి దుర్జనులు చివరకు ఐహికసుఖాలను నష్టపోతారు; వ్యర్ధమైన కోరికల వెంటబడి నీళ్ళనే భ్రమతో ఎండమావులను చేరినట్లు భ్రష్టులైపోతారు; సంసారసముద్రాన్ని దాటలేక నశించిపోతారు; అటువంటి క్లేశములు మేము అనుభవించలేము. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=752 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: