Friday, October 1, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౪(354)

( జరాసంధ వధ) 

10.2-736-చ.
మడవక భీమసేనుఁడును మాగధరాజు గడంగి బెబ్బులుల్‌
విడివడు లీల నొండొరుల వీఁపులు మూఁపులునుం బ్రకోష్ఠముల్‌
నడితల లూరు జాను జఘనప్రకరంబులు బిట్టు వ్రయ్యఁగాఁ
బిడుగులఁబోలు పెన్గదల బెట్టుగ వ్రేయుచుఁ బాయుచున్ వెసన్.
10.2-737-లవి.
బెడ గడరు పెన్గదలు పొడిపొడిగఁ దాఁకఁ, బెను;
  పిడుగు లవనిం దొరఁగ, నుడుగణము రాలన్,
మిడుఁగుఱులు చెద్ర, నభ మడల, హరిదంతములు;
  వడఁక, జడధుల్‌ గలఁగఁ, బుడమి చలియింపన్,
వెడచఱువ మొత్తియునుఁ, దడఁబడఁగ నొత్తియును;
  నెడమగుడు లాఁచి తిరుగుడు పడఁగ వ్రేయన్,
వడవడ వడంకుచును, సుడివడక డాసి, చల;
  ముడుగ కపు డొండొరుల వడిచెడక పోరన్. 

భావము:
భీమజరాసంధులు ఏమాత్రం వెనుదీయకుండా విజృంభించి పెద్దపులుల్లాగా ఒకరినొకరు వీపులూ మూపులూ ముంజేతులూ శిరస్సులూ తొడలూ మోకాళ్ళూ నడుములూ బ్రద్దలయ్యేటట్లు గట్టిగా పెద్ద పెద్ద గదాఘట్టనలతో కొట్టుకోసాగారు. అలా పరస్పరం మోదుకుంటూ, తప్పించుకుంటూ... పెనుగదలు బద్దలై పొడిపొడిగా రాలేలాగ, పిడుగులు పడేలా, చుక్కలు రాలేలా, నిప్పురవ్వలు వ్యాపించేలా, దిక్కులు వణికేలాగ, సముద్రాలు అల్లకల్లోల మయ్యేలాగ, భూమి చలించేలా; కొట్టుకుంటూ, నెట్టుకుంటూ; ఒకరికొకరు తీసిపోకుండా; పిడుగుపాటు దెబ్బలకు అదిరిపోతున్నా, తడబాటు అన్నది లేకుండా తట్టుకుంటూ ఆ భీమజరాసంధులు యుద్ధం చేశారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=57&Padyam=737 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: