10.2-753-ఉ.
వేదవధూశిరోమహితవీథులఁ జాల నలంకరించు మీ
పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁబల్కు దా
మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా!"
10.2-754-క.
అని తను శరణము వేఁడిన
జననాథుల వలను సూచి సదమలభక్తా
వనచరితుఁడు పంకజలో
చనుఁ డిట్లను వారితోడ సదయామతియై.
10.2-755-చ.
"జనపతులార! మీ పలుకు సత్యము; రాజ్యమదాంధచిత్తులై
ఘనముగ విప్రులం బ్రజలఁ గాఱియఁ బెట్టుటఁ జేసి కాదె వే
న నహుష రావణార్జునులు నాశము నొందిరి; కాన ధర్మ పా
లనమునఁగాక నిల్చునె? కులంబుబలంబుఁ జిరాయురున్నతుల్.
భావము:
యశోదామాతచే ఉదరమున తాడు కట్టబడిన దామోదరా! శ్రీకృష్ణా! దుష్ట సంసారసాగరాన్ని తరింపచేసేవాడా. ఈ సమస్త సృష్టికీ కారణమైన వాడా. వేదాంత వీధుల్లో విహరించే నీ పాదపద్మాలు మా హృదయాల్లో ఎల్లప్పుడూ నిలచి ఉండే ఉపాయాన్ని మాకు అనుగ్రహించు.” భక్తజనావాసుడైన పద్మలోచనుడు దయతో కూడినవాడై, తనను శరణుకోరుతున్న ఆ రాజులకు ఇలా చెప్పాడు. “ఓ రాజులారా! మీ మాట నిజం. రాజ్యమదంతో బ్రాహ్మణులనూ, ప్రజలనూ మిక్కిలి బాధించటం వలననే కదా వేనుడు, నహుషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు నాశనమయ్యారు. కాబట్టి ధర్మాన్ని పాటించకపోతే కులం, బలం, ఆయుస్సు, ఔన్నత్యం నిలబడవు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=755
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment