Wednesday, October 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౫౯(359)

( రాజబంధ మోక్షంబు ) 

10.2-746-వ.
అయ్యవసరంబునఁ గృష్ణుండు దన దివ్యచిత్తంబున మఱవ నవధరింపక చెఱలు విడిపించిన, వారలు పెద్దకాలంబు కారాగృహంబులఁ బెక్కు బాధలం బడి కృశీభూతశరీరు లగుటంజేసి, రక్తమాంస శూన్యంబులై త్వగస్థిమాత్రావశిష్టంబులును, ధూళిధూసరంబులు నైన దేహంబులు గలిగి, కేశపాశంబులు మాసి, జటాబంధంబు లైన శిరంబులతో మలినవస్త్రులై చనుదెంచి; యప్పుడు.
10.2-747-సీ.
నవపద్మలోచను, భవబంధమోచను-
  భరితశుభాకారు, దురితదూరుఁ,
గంగణకేయూరుఁ, గాంచనమంజీరు-
  వివిధశోభితభూషు, విగతదోషుఁ,
బన్నగాంతకవాహు, భక్తమహోత్సాహు-
  నతచంద్రజూటు, నున్నతకిరీటు,
హరినీలనిభకాయు, వరపీతకౌశేయుఁ-
  గటిసూత్రధారు, జగద్విహారు
10.2-747.1-తే.
హార వనమాలికా మహితోరువక్షు,
శంఖచక్రగదాపద్మశార్‌ఙ్గహస్తు,
లలిత శ్రీవత్సశోభితలక్షణాంగు,
సుభగచారిత్రు దేవకీసుతునిఁ గాంచి. 

భావము:
అలా ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరచిపోకుండా ఆ రాజులు అందరిని కారాగారం నుండి విముక్తులను చేసాడు. వారు చాలాకాలం పాటు చెరసాలలో బంధించబడి అనేక బాధలు పడుతూ ఉండడం వలన రక్తమాంసాలు క్షీణించి, చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, జడలు కట్టిన తలలతో, మాసిన బట్టలతో వాసుదేవుడి వద్దకు వచ్చారు. పద్మాక్షుడూ, భవబంధ విమోచనుడూ, దురిత దూరుడూ, నానాలంకార సంశోభితుడూ, దోష రహితుడూ, భక్తులకు ఉత్సాహాన్ని ఇచ్చేవాడూ, శివుడి చేత పొగడబడేవాడూ, సకల లోక విహారుడు, గరుడ వాహనుడూ, మంగళాకారుడూ, ఇంద్రనీల ఛాయ దేహము వాడూ, విశాల వక్షము వాడు, గొప్ప కిరీటం ధరించు వాడు, పచ్చని పట్టువస్త్రాలు ధరించు వాడు, ముత్యాల పేరులు వనమాలలు ధరించువాడు, శ్రీవత్సశోభితుడూ, శంఖ చక్ర గదా శార్ఞ్గ పద్మాలను ధరించు వాడు, పవిత్ర చరితుడూ, దేవకీపుత్రుడూ అయిన కృష్ణుడిని ఆ రాజులు అందరు చేరి దర్శించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=58&Padyam=747 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: