Friday, April 23, 2021

శ్రీకృష్ణ విజయము - 205

( నాగ్నజితి పరిణయంబు )

10.2-134-వ.
అనిన రాజిట్లనియె.
10.2-135-శా.
"కన్యం జేకొన నిన్నిలోకముల నీ కన్నన్ ఘనుండైన రా
జన్యుం డెవ్వఁడు? నీ గుణంబులకు నాశ్చర్యంబునుం బొంది తా
నన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్యయై
ధన్యత్వంబునుఁ జెంది యున్నది గదా తాత్పర్యసంయుక్తయై.
10.2-136-శా.
చంచద్గోవృషసప్తకంబుఁ గడిమిన్ సైరించి యెవ్వాఁడు భం
జించున్ వానికిఁ గూఁతు నిత్తు నని యేఁ జీరించినన్ వైభవో
దంచద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ తత్పాద శృంగాహతిం
గించిత్కాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులై.

భావము:
కృష్ణుడు ఇలా అనగా కోసల రాజు ఇలా చెప్పాడు. “నా కుమార్తెను వివాహమాడడానికి ఈ లోకాలు అన్నిటిలో, నీకంటే తగిన వాడెవడు? నీ సద్గుణాలకు మెచ్చి వరించి లక్ష్మీదేవి, ఇతరులను కాదని, నీ వక్షస్థలంలో శాశ్వత స్థానం సంపాదించుకుని ధన్యురాలైంది. ఆ ఏడువృషభాలను బాహుబలంతో ఎదుర్కుని ఎవడు జయిస్తాడో? అతనికి నా కుమార్తెను ఇచ్చి వివాహం జరుపుతానని చాటించాను. గర్విష్టులైన రాజులెందరో వచ్చి ఆంబోతులగిట్టల దెబ్బలకు కొంచంసేపు కూడా తట్టుకోలేక ఛిన్నాభిన్నా మైన శరీరాలతో పోటీ నుండి తప్పుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=136

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: