Saturday, April 10, 2021

శ్రీకృష్ణ విజయము - 195

( ఇంద్రప్రస్థంబున కరుగుట)

10.2-108-సీ.
"అన్న! నీ చుట్టాల నరయుదు! మఱవవు-
  నీవు పుత్తెంచిన నెమ్మితోడ
మా యన్న యేతెంచి మముఁ జూచి పోయెను-
  నిల్చి యున్నారము నీ బలమున;
నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు-
  నేఁ డాదిగా నింక నీవె కాక?
యఖిల జంతువుల కీ వాత్మవు గావునఁ-
  బరులు నా వారని భ్రాంతి సేయ;
10.2-108.1-తే.
వయ్య! నా భాగ్యమెట్టిదో? యనవరతముఁ
జిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్లఁ
వాపుచుందువు గాదె! యో! పరమపుణ్య!
యదుకుమారవరేణ్య! బుధాగ్రగణ్య! ."
10.2-109-వ.
అనిన యుధిష్ఠిరుం డిట్లనియె.

భావము:
“ఓ పుణ్యాత్మా! యదుకులతిలకా! పురుషోత్తమా! కృష్ణా! నీవు నీ బంధువులను మరచిపోకుండా ఆదరిస్తావు. నీవు పంపించగా అక్రూరుడు వచ్చి ఆదరంగా మమ్మల్ని పలకరించి వెళ్ళాడు. నీ అండ వలననే మేము జీవించి ఉన్నాము. నా పిల్లలకు, నాకు నీవు కాక మరెవరు దిక్కు. సర్వప్రాణులకు నీవే ఆత్మవు కనుక, పరులు నా వారు అని నీకు భేదంలేదు. మమ్మల్ని మరచిపోకుండా నీవు కరుణతో మా చిక్కులు అన్నింటినీ తొలగిస్తున్నావు. ఇదంతా నా భాగ్యం కాక మరేమిటి.” పిమ్మట, ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు,

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=108

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: