10.2-124-వ.
అంతం గృష్ణుండు ధర్మరాజప్రముఖుల వీడుకొని, సాత్యకిప్రముఖ సహచరులు గొలువ, మరలి తనపురంబునకుం జని బంధుజనంబులకుఁ బరమానందంబు సేయుచు నొక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునం గాళిందిం బెండ్లి యయ్యె; మఱియు నవంతి దేశాధీశ్వరులయిన విందానువిందులు దుర్యోధనునకు వశులై హరికి మేనత్తయైన రాజాధిదేవి కూఁతురైన తమ చెలియలిని వివాహంబు సేయనుద్యోగించి స్వయంవరంబుఁ జాటించిన.
10.2-125-క.
భూ రమణులు సూడఁగ హరి
వీరతఁ జేకొనియె మిత్రవిందను నిత్యా
పూరిత సుజనానందం
జారు చికురకాంతి విజిత షట్పదబృందన్.
భావము:
అటుపిమ్మట, శ్రీకృష్ణుడు ధర్మరాజాదుల వద్ద వీడ్కోలు తీసుకుని, సాత్యకి మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చాడు. బంధువు లందరకూ సంతోషం కలిగిస్తూ, ఒక శుభముహుర్తంలో కాళిందిని పరిణయమాడాడు. అనంతరం అవంతీ పరిపాలకు లైన విందానువిందులు దుర్యోధనునకు వశమయ్యారు. వారి తల్లి అయిన రాజాధిదేవి శ్రీకృష్ణునకు మేనత్త, వారు తమ చెల్లి పెండ్లికి స్వయంవరం చాటించారు. రాజులు అందరూ చూస్తూ ఉండగా, శ్రీ కృష్ణుడు ఎదురులేని తన పరాక్రమం ప్రదర్శించి, అలినీలవేణి కాంతులతో తుమ్మెదల కదుపులను ఓడించేటంత, సుజనుల కన్నులకు నిండు సంతోషం కలిగించేటంత అందాలరాణి ఐన మిత్రవిందను చేపట్టాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=16&Padyam=125
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment