Friday, April 9, 2021

శ్రీకృష్ణ విజయము - 194

( ఇంద్రప్రస్థంబున కరుగుట)

10.2-105-వ.
అంత సాత్యకి పాండువులచేతం బూజితుండై యొక్క పీఠంబున నాసీనుండై యుండెఁ; దక్కిన యనుచరులును వారిచేతఁ బూజితులై కొలిచి యుండిరి; హరియుం గుంతీదేవి కడకుం జని నమస్కరించి యిట్లనియె.
10.2-106-క.
"అత్తా! కొడుకులుఁ గోడలుఁ
జిత్తానందముగఁ బనులు సేయఁగ నాత్మా
యత్తానుగవై యాజ్ఞా
సత్తాదులు గలిగి మనుదె సమ్మోదమునన్? "
10.2-107-చ.
అనవుడుఁ బ్రేమ విహ్వలత నందుచు గద్గదభాషణంబులం
గనుఁగవ నశ్రుతోయములు గ్రమ్మఁగఁ గుంతి సుయోధనుండు సే
సిన యపచారముం దలఁచి చెందిన దుఃఖములెల్లఁ జెప్పి యా
దనుజవిరోధి కిట్లనియెఁ దద్దయుఁ బెద్దఱికంబు సేయుచున్.

భావము:
అప్పుడు, పాండవులు సాత్యకిని గౌరవించారు. అతను కూడ ఒక ఆసనం పై ఆసీనుడు అయ్యాడు. తక్కిన యాదవులను కూడా పాండవులు చక్కగా సన్మానించారు. వారు కూడ కొలువుదీరారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి చెంతకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు. “అత్త! నీ కొడుకులూ, కోడలు ద్రౌపదీ నీ మనసునకు ఆనందం కల్గిస్తుండగా సమ్మోదంతో జీవితం గడుపుతున్నావా.” ఇలాగ శ్రీకృష్ణుడు అడుగగా, కుంతీదేవి ప్రేమ విహ్వలతతో డగ్గుత్తికతో కనుల నీరు కమ్ముతుండగా, దుర్యోధనుడు చేసిన అపకారాలు, తాము పడ్డ కష్టాలు అన్నీ చెప్పి, శ్రీకృష్ణునకు పెద్దరిక మిచ్చి ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=107

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: