Sunday, April 18, 2021

శ్రీకృష్ణ విజయము - 202

( నాగ్నజితి పరిణయంబు )

10.2-126-సీ.
జననాథ! వినుము కోసలదేశ మేలెడి;-
  నగ్నజిత్తను నరనాథుఁ డొకడు
సుమతి ధార్మికుఁడు దత్సుత నాగ్నజితి యను;-
  కన్యక గుణవతి గలదు దానిఁ
బెండ్లియాడుటకునై పృథివీశు లేతెంచి;-
  వాఁడికొమ్ములు గల వాని, వీర
గంధంబు సోఁకినఁ గాలు ద్రవ్వెడివాని,-
  నతిమదమత్తంబు లయిన వాని
10.2-126.1-తే.
గోవృషంబుల నేడింటిఁ గూర్చి తిగిచి
బాహుబలమున నెవ్వఁడు పట్టి కట్టు
నతఁడు కన్యకుఁ దగు వరుం డనిన వానిఁ
బట్టఁజాలక పోదురు ప్రజలు బెగడి.
10.2-127-వ.
ఇట్లు గోవృషంబుల జయించినవాఁడ క్కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్కొని యర్ఘ్యపాద్యాది విధులం బూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై యున్న యెడ.

భావము:
ఓ పరీక్షన్మహారాజా! కోసలదేశాన్ని సద్గుణుడు ధర్మపరుడు అయిన నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. సద్గుణ సంపన్న. ఆ రాజు దగ్గర వాడి కొమ్ములు కలిగి వీరగంధం సోకితే చాలు కాలుద్రవ్వుతుండే మిక్కిలి మదించిన ఏడు ఆబోతులు ఉన్నాయి. ఆ వృషభాలను తన బాహుబలంతో ఎవడు కట్టివేస్తాడో, అతడే నాగ్నజితికి భర్త అని ఆ రాజు నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి ఆ ఎద్దులను చూసి బెదిరి పోయారు, పట్టికట్టలేకపోయారు. ఆ వృషభాలను జయించినవాడే ఆ కన్యకు భర్త అని వినిన శ్రీకృష్ణుడు సేనాసమేతంగా కోసలదేశానికి వెళ్ళాడు. ఆరాజు శ్రీకృష్ణుని గొప్పగా గౌరవించాడు. అర్ఘ్యం, పాద్యం, పీఠం, నమస్కారాదులతో సత్కరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=126

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: