10.2-112-మ.
తురగశ్రేష్ఠము నెక్కి కంకటధనుస్తూణీశరోపేతుఁడై
హరితోడన్ వనభూమి కేగి విజయుం డాసక్తుఁడై చంపె శం
బర శార్దూల తరక్షు శల్య చమరీ భల్లూక గంధర్వ కా
సర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగ ముఖ్యంబులన్.
10.2-113-క.
అచ్చోటఁ బవిత్రములై
చచ్చిన మృగరాజి నెల్ల జననాథునకుం
దెచ్చి యొసంగిరి మెచ్చుగఁ
జెచ్చెర నరుఁ గొల్చి యున్న సేవకు లధిపా!
10.2-114-వ.
అంత నర్జునుండు నీరుపట్టున డస్సిన, యమునకుం జని, య మ్మహారథులైన నరనరాయణు లందు వార్చి జలంబులు ద్రావి, యొక పులినప్రదేశంబున నుండి.
భావము:
ఒకనాడు అర్జునుడు అశ్వారూఢుడై శ్రీకృష్ణునితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ జింకలను, పెద్దపులులను, సివంగులను, ఏదుపందులను, చమరీమృగాలను, ఎలుగుబంట్లను, దుప్పులను, ఎనుబోతులను, సింహాలను, ఖడ్గమృగాలను, వనవరాహాలను, లేళ్ళను, ఇఱ్ఱి లేళ్ళను, ఏనుగులను ఆసక్తితో వేటాడాడు. అలా చనిపోయిన అర్హ మృగాలను అన్నింటినీ ధర్మరాజు మెచ్చుకునేలా అర్జునుడి సేవకులు శీఘ్రంగా తెచ్చి ఆయనకు ఇచ్చారు. అప్పుడు అర్జునుడుకి దాహంవేసి బాగా అలసిపోయాడు. ఆ నరనారాయణులు ఇద్దరూ యమునానదికి వెళ్ళి ఆచమనం చేసి, దాహం తీర్చుకుని, ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=113
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment