Tuesday, April 13, 2021

శ్రీకృష్ణ విజయము - 198

( అర్జునితో మృగయావినోదంబు )

10.2-115-ఉ.
ఉపగతు లైన యట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా
విపుల విలోల నీలతర వీచికలందు శిరోజభార రు
చ్యపహసితాళిమాలిక నుదంచిత బాల శశిప్రభాలికం
దపనుని బాలికన్ మదనదర్పణతుల్య కపోలపాలికన్.
10.2-116-వ.
కని యచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని యా కన్య కిట్లనియె.
10.2-117-మ.
"సుదతీ! యెవ్వరి దాన? వేమికొఱ కిచ్చోటం బ్రవర్తించె? దె
య్యది నీ నామము? కోర్కి యెట్టిది? వివాహాకాంక్షతోఁగూడి యీ
నదికిన్ వచ్చినజాడ గానఁబడె? ధన్యంబయ్యె నీ రాక, నీ
యుదయాదిస్థితి నెల్లఁ జెప్పు మబలా! యుద్యత్కురంగేక్షణా! "
10.2-118-వ.
అనిన నర్జునునకుఁ గాళింది యిట్లనియె.

భావము:
కృష్మార్జునులు అలా యమున ఇసుకతిన్నెలపై కూర్చుని ఉన్నప్పుడు, ఆ నదీతరంగాలలో తుమ్మెదల సమూహాన్ని ధిక్కరించే శిరోజశోభతో, బాలచంద్రుడిని బోలిన నెన్నుదురుతో, అద్దాలవంటి చెక్కిళ్ళతో ప్రకాశించే, సూర్యుని కుమార్తెను చూసారు. శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె చెంతకు వెళ్ళి ఇలా అన్నాడు. “ఓ అమ్మాయీ! బహు చక్కటి దంతాల చక్కనమ్మా! సుకుమారీ! లేడికన్నుల వన్నెలాడీ! నీవెవరవు? ఎందు కోసం ఇక్కడ తిరుగున్నావు? నీ పేరేమిటి? నీ కోరికేమిటి? వివాహకాంక్షతో ఈ ప్రాంతానికి వచ్చినట్లున్నావు. నీ రాక ధన్యమైనది. నీ ప్రయత్నం నెరవేరుతుంది. నీ గురించిన విశేషాలు అన్నింటినీ చెప్పు.” అలా అడిగిన అర్జునుడితో ఆ అమ్మాయి, కాళింది ఇలా సమాధానం చెప్పింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=117

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: