Saturday, April 3, 2021

శ్రీకృష్ణ విజయము - 189

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-94-క.
చలమున గాంధారేయుఁడు
లలిత గదాయుద్ధగౌశలము నేర్చెఁ దగన్
హలిచే నాశ్రితనిర్జర
ఫలిచేఁ ద్రైలోక్యవీరభటగణబలిచేన్.
10.2-95-వ.
అటఁ గృష్ణుండును ద్వారకానగరంబునకుం జని శతధన్వుని మరణంబును మణి లేకుండుటయును, సత్యభామకుం జెప్పి, సత్యభామాప్రియకరుండు గావున సత్రాజిత్తునకుఁ బరలోకక్రియలు సేయించె; నక్రూర కృతవర్మలు శతధన్వు మరణంబు విని వెఱచి ద్వారకానగరంబు వెడలి బహుయోజన దూరభూమికిం జని; రక్రూరుండు లేమిం జేసి వానలు లేక మహోత్పాతంబులును, శరీర మానస తాపంబులును ద్వారకావాసులకు సంభవించిన నందుల వృద్ధజనులు బెగడి హరి కిట్లనిరి.

భావము:
హలాయధధారీ, ఆశ్రితపారిజాతమూ, త్రిలోకవీరుడూ ఐన బలరాముడి వద్ద పట్టుదలగా, గాంధారీదేవి కొడుకు అయిన దుర్యోధనుడు గదా యుద్ధ కౌశలము అంతా నేర్చుకున్నాడు. శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరి సత్యభామతో శతధన్వుడిని సంహరించిన సంగతి, అతడి దగ్గర మణి కానరాని విషయము తెలిపి, సత్రాజిత్తునకు ఉత్తరక్రియలు జరిపించాడు. శతధన్వుడి మరణ వార్త వినిన అక్రూర, కృతవర్మలు భయపడిపోయి, ద్వారకాపట్టణం వదలి ఎన్నో యోజనాల దూర ప్రాంతానికి పాఱిపోయారు. అక్రూరుడు దేశంలో లేకపోవడంతో, అనేక ఉపద్రవాలు కలిగాయి. వర్షాలు కురియ లేదు. ద్వారకలోని ప్రజలకు శారీరక మానసిక, తాపాలు సంభవించాయి. అప్పుడు ద్వారకానగరం లోని వయోవృద్ధులు భయపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=95

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: