10.2-103-వ.
అంత నొక్కనాఁడు పాండవులం జూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు గొలువఁ బురుషోత్తముం డింద్రప్రస్థపురంబునకుం జనినం బ్రాణంబులంగనిన యింద్రియంబులభంగి వారఖిలేశ్వరుం డైన హరిం గని కౌఁగిలించుకొని; కృష్ణుని దివ్యదేహసంగమంబున నిర్ధూతకల్మషులై యనురాగహాసవిభాసితం బైన ముకుంద ముఖారవిందంబు దర్శించి యానందంబు నొందిరి; గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకు నభివందనంబులు సేసి యర్జును నాలింగనంబున సత్కరించి, నకుల సహదేవులు మ్రొక్కిన గ్రుచ్చియెత్తి, యుత్తమ పీఠంబున నాసీనుండై యుండె; నప్పుడు.
10.2-104-క.
చంచద్ఘనకుచభారా
కుంచితయై క్రొత్త పెండ్లికూఁతు రగుట నిం
చించుక సిగ్గు జనింపఁగఁ
బాంచాలతనూజ మ్రొక్కెఁ బద్మాక్షునకున్.
భావము:
అటుపిమ్మట, ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలి అనుకున్నాడు. సాత్యకి మొదలైన యాదవులతో కలిసి ఇంద్రప్రస్థనగరానికి వెళ్ళాడు. పాండవులు ప్రాణాన్ని పొందిన ఇంద్రియాల వలె, సర్వేశ్వరు డైన శ్రీకృష్ణుడిని దర్శించి, కౌగలించుకున్నారు. విష్ణుదేవుని దివ్యశరీరము యొక్క స్పర్శ వలన వారి పాపాలన్నీ పటాపంచలు అయిపోయాయి. అనురాగపూరిత మైన చిరునవ్వుతో కూడిన శ్రీకృష్ణుడి ముఖపద్మాన్ని దర్శించి, వారు ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడు ధర్మరాజు, భీమసేనుల పాదాలకు నమస్కరించాడు. అర్జునుడిని ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన నకుల, సహదేవులను ఆదరించాడు. ఒక ఉన్నతపీఠం పైన ఆసీనుడయ్యాడు. అప్పుడు స్తనభారంతో అవనత అయి, క్రొత్త పెళ్ళికూతురు కావడం చేత సిగ్గుపడుతూ పాంచాలరాజపుత్రి ద్రౌపది పద్మాల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడికి నమస్కరించింది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=14&Padyam=104
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment