Wednesday, April 21, 2021

శ్రీకృష్ణ విజయము - 204

( నాగ్నజితి పరిణయంబు )

10.2-131-మ.
సిరియుం బద్మభవేశ దిక్పతులు మున్ సేవించి యెవ్వాని శ్రీ
చరణాంభోజపరాగముల్‌ శిరములన్ సమ్యగ్గతిం దాల్తుఁ; రీ
ధరణీచక్రభరంబు వాపుటకు నుద్యత్కేళిమూర్తుల్‌ దయా
పరుఁడై యెవ్వఁడు దాల్చు నట్టి హరి యెబ్భంగిం బ్రవర్తించునో! "
10.2-132-వ.
అని యిట్లు నాగ్నజితి విచారించు నెడఁ గృష్ణుం డా రాజుం జూచి మేఘగంభీర నినదంబున నిట్లనియె.
10.2-133-క.
"అన్యుల యాచింపరు రా
జన్యులు సౌజన్యకాంక్షఁ జనుదెంచితి నీ
కన్యన్ వేఁడెద నిమ్మా!
కన్యాశుల్కదుల మేము గాము నరేంద్రా!"

భావము:
లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు. శంకరుడు, దిక్పాలకులు సైతం ఎవని పాదధూళిని శిరసున ధరించి సేవిస్తారో? భూభారాన్ని తగ్గించడానికి ఎవడు దయతో లీలావతారాలు ధరిస్తాడో? ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు నా విషయంలో ఎమి చేస్తాడో?” ఇలా నాగ్నజితి చింతిస్తున్న సమయంలో కృష్ణుడు కోసలరాజు నగ్నజిత్తితో మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు. “రాజులు పరులను యాచించరు. నేను సౌజన్యంతో నీ కుమార్తెను వివాహం చేసుకోడానికి వచ్చాను. నాకు ఇమ్ము. మేము కన్యాశుల్కం ఇచ్చేవారము కాము సుమా.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=17&Padyam=133

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: