Tuesday, April 6, 2021

శ్రీకృష్ణ విజయము - 191

( దుర్యోధనుని గదా విధ్యాభ్యాసము )

10.2-98-సీ.
"తా నేగుతఱి శతధన్వుండు మణిఁ దెచ్చి-
  నీ యింటఁ బెట్టుట నిజము తెలిసి
నాఁడ, సత్రాజిత్తునకుఁ బుత్త్రకులు లేమి-
  నతనికిఁ గార్యంబు లాచరించి
విత్తంబు ఋణమును విభజించుకొనియెద-
  రతని పుత్త్రిక లెల్ల, నతఁడు పరుల
చేత దుర్మరణంబుఁ జెందినాఁ, డతనికై-
  సత్కర్మములు మీఁద జరుపవలయు,
10.2-98.1-ఆ.
మఱి గ్రహింపు మీవ, మా యన్న నను నమ్మఁ
డెలమి బంధుజనుల కెల్లఁ జూపు
మయ్య! నీ గృహమున హాటక వేదికా
సహితమఖము లమరు సంతతమును. "
10.2-99-వ.
అని యిట్లు సామవచనంబులు హరి పలికిన నక్రూరుండు వస్త్రచ్ఛన్నంబైన మణిం దెచ్చి హరి కిచ్చిన.

భావము:
“శతధన్వుడు తాను వెళుతూ మీ ఇంటిలో ఆ శమంతకమణిని దాచిపెట్టిన సంగతి తెలుసుకున్నాను. సత్రాజిత్తుకు కుమారులు లేరు కనుక అతనికి పరలోకక్రియలు ఆచరించి అతని ఆస్తిని అప్పును సత్రాజిత్తు కుమార్తెలు పంచుకుంటారు. అతడు పరుల చేత దుర్మరణం చెందాడు. అతడికి సత్కర్మలు జరగాలి. శమంతకమణిని నీవే తీసుకో. మా అన్న నన్ను నమ్మడు కనుక, బంధువులకు అందరికీ చూపించు. నీ ఇంట్లో నిత్యం బంగారు వేదికల మీద యజ్ఞ కార్యాలు కొనసాగుతాయి.” ఈ విధంగా శ్రీకృష్ణుడు సాంత్వవాక్యాలు పలుకడంతో, తన వస్త్రంలో దాచితెచ్చిన శమంతకమణిని అక్రూరుడు కృష్ణుడికి సమర్పించాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=13&Padyam=98

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments: