Wednesday, November 28, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 60

10.1-546-క.
అడుగులపైఁ బడు లేచున్
బడుఁ గ్రమ్మఱఁ లేచు, నిట్లు భక్తిన్ మును దాఁ
బొడగనిన పెంపుఁ దలఁచుచు
దుడుకని మహిమాబ్ధి నజుఁడు దుడు కడఁచె నృపా!
10.1-547-వ.
అంత నల్లనల్లన లేచి నిలుచుండి నయనారవిందంబులు దెఱచి, గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలియై దిగ్గన డగ్గుత్తిక యిడుచు నేకచిత్తంబున జతుర్ముఖంబుల నిట్లని స్తుతియించె.

భావము:
పరవశత్వంతో బ్రహ్మదేవుడు కృష్ణుడి పాదాలపై అనేక సార్లు పడుతూ లేస్తూ ప్రణమిల్లాడు. భక్తిపరవశుడై ఇంతకు ముందు తాను చూసిన విశ్వరూపం తలచుకుని ఆ బాలుని మహిమ అనే మహాసముద్రంలో మునిగిపోయాడు. తరువాత, బ్రహ్మదేవుడు నెమ్మదిగా లేచి నిలబడి కళ్ళు తెరచి గోవులను కాస్తున్న గోవిందుని దర్శనం చేసుకున్నాడు. తన ముఖాలు నాలుగూ వంచి చేతులు జోడించి డగ్గుత్తిక పడిన గొంతుతో ఏకాగ్రమైన మనస్సుతో నాలుగు నోరులారా ఇలా స్తుతించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=546

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: