Wednesday, November 21, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 51

10.1-530-శా.
“మందం గల్గిన వత్సబాలకులు నా మాయా గుహాసుప్తులై
యెందుం బోవరు; లేవ రిప్పుడును; వేఱే చేయ నా కన్యు లొం
డెందున్ లేరు; విధాతలుం బరులు; వీ రెవ్వార లెట్లైరొకో? 
యెం దేతెంచిరొ కృష్ణుతో మెలఁగువా? రేఁడయ్యెడిన్ నేఁటికిన్.
10.1-531-మత్త.
బ్రహ్మపంపునఁ గాని పుట్టదు ప్రాణిసంతతి యెప్పుడున్
బ్రహ్మ నొక్కఁడ గాని వేఱొక బ్రహ్మ లేఁడు సృజింపఁగా 
బ్రహ్మ నేను సృజింప నొండొక బాలవత్సకదంబ మే
బ్రహ్మమందు జనించె? నొక్కట బ్రహ్మమౌ నది చూడఁగాన్.”

భావము:
ఈ గోకులంలో ఉండే బాలకులు దూడలూ అందరూ నా మాయా గుహలో ఇప్పటికీ అక్కడే నిద్రపోతున్నారు. ఎక్కడకీ పోలేదు. మళ్లీ ఎవరైనా సృష్టి చేసారు అనుకుందాం అంటే; నేను తప్ప సృష్టికర్తలు అయిన బ్రహ్మలు ఇంక ఎవరూ లేరు కదా. మరి వీరెవరు? ఎలా వచ్చారో? నేటికి భూలోకంలో ఏడాది గడిచింది. మరి ఈ కృష్ణుడితో విహరిస్తున్న వీళ్ళంతా ఎక్కడ నుంచి వచ్చారో? బ్రహ్మదేవుడు సృష్టిస్తే గాని ఈ జీవరాసు లేవీ పుట్టవు కదా. సృష్టి చేసే బ్రహ్మదేవుడు అంటే నేనొక్కడినే గాని మరింకొకడు లేడు కదా. బ్రహ్మదేవుడుగా నేను సృష్టించిన గొల్లపిల్లలు దూడలు కాక వేరేవి ఎలా వచ్చాయి? వీటిని ఏ బ్రహ్మదేవుడు సృష్టించాడు? అందరిలోనూ ఒక్కటిగా ఉండే పరబ్రహ్మ కాదు కదా వీటి సృష్టికర్త?”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=531

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: