Sunday, November 11, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 45

10.1-522-వ.
ఇట్లు కృష్ణుండు బాలవత్సరూపంబులు దాల్చి తన్నుఁ దాన రక్షించుకొనుచు, మందను వనంబున నమంద మహిమంబున నొక్క యేఁడు గ్రీడించె, నా యేటికి నైదాఱు దినంబులు కడమపడి యుండ నం దొక్కనాఁడు బలభద్రుండును, దానును వనంబునకుం జని మందచేరువ లేఁగల మేప నతి దూరంబున గోవర్థన శైలశిఖరంబున ఘాసంబులు గ్రాసంబులు గొనుచున్న గోవు లా లేఁగలం గని.
10.1-523-చ.
ముదమున హుంకరించుచును; మూఁపులపై మెడ లెత్తి చాఁచుచున్
బదములు నాల్గు రెండయిన బాగునఁ గూడఁగ బెట్టి దాఁటుచున్
వదనములన్ విశాలతర వాలములన్ వడి నెత్తి పాఱి యా
మొదవులు చన్నులంగుడిపె మూఁతుల మ్రింగెడిభంగి నాకుచున్.


భావము:
ఇలా బాలకృష్ణుడు గొల్లపిల్లల రూపాలూ దూడల రూపాలు తానే ధరించి, అందరి రూపాలలోనూ ఉన్న తనను తాను రక్షించుకుంటూ, ఆ బృందావనంలోనూ గోకులంలోనూ మహమహిమతో ఒక ఏడాది పాటు విహరించాడు. ఏడాదికి ఇంకా ఐదారు రోజులు ఉన్నయి అనగా, ఒకనాడు తాను బలరాముడు అడవికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతున్నారు. ఆ ప్రదేశానికి చాలాదూరంగా గోవర్ధనపర్వత శిఖరంపైన గోపకులు ఆవులు మేపుతున్నారు. ఆ కొండ మీది ఆవులు ఈ క్రింద ఉన్న దూడలను చూసాయి. ఆనందంతో ఆ ఆవులు ఒక్కసారి హూంకరించాయి; మూపుల పైదాకా మెడలు ఎత్తి వేగంగా చెంగుచెంగున దాట్లువేస్తూ పరిగెత్తాయి; తోకలు ముఖాలపైకి వచ్చేలా ఎత్తి దూడల దగ్గరకు పరిగెత్తాయి; లేగల మూతులను ఆత్రంగా నాకుతూ ఆవులు లేగలకు పాలు కుడిపాయి.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: