Sunday, November 25, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 57

10.1-542-శా.
బాలుండై చతురాననుండు తన యీ బ్రహ్మాభిమానంబునన్
లోలుండై మతిదప్పి నా మహిమ నాలోకింప నేతెంచెఁ దా
నాలోకింపఁగ నెంతవాఁ? డనుచు మాయాజాలమున్ విప్పి త
ల్లీలా రూపము లెల్ల డాఁచె నటఁ గేళీచాతురీధుర్యుఁడై.
10.1-543-వ.
అంతలోన నజీవుండు సజీవుండైన తెఱంగున నెనిమిది కన్నులు గల వేల్పుగమికాఁడు తేఱి తెప్పఱి కాలుఁ గేలుఁ గదలించి చెచ్చెరం గన్నులు విచ్చిచూడ సమర్థుండై ముందటఁ గని వెనుకఁ జూచి, దివి విలోకించి దిక్కులు వీక్షించి, యెల్లయెడలం గలయ దర్శించి తన పురోభాగంబున హరి సంచరించుటం జేసి జాతివైరంబు లేని నర పక్షి మృగాదులకు నాటపట్టయి సిరి గలిగి కామ క్రోధాది రహితులకు జీవనంబైన బృందావనంబుఁ బొడగాంచి; యందు.


భావము:
“ఈ బ్రహ్మదేవుడు తనకు నాలుగు తలలు ఉన్నాయి అనుకుంటున్నాడు. బాలభావంతో తన ఈ బ్రహ్మపదవిని చూచుకుని అహంకారంలో మునిగిపోయాడు. అజ్ఞానంలో నిమగ్నమైపోయి నా మహిమ ఎంతటిదో చూడాలని వచ్చాడు. ఇంతటి మహామహిమ చూడడానికి అతడు ఎంతో చిన్నవాడు కదా.” అని జాలిపడి భగవంతుడైన బాలకృష్ణుడు తన మాయాజాలాన్ని విప్పివేసాడు. తాను సృష్టించిన లీలారూపాలు అన్నింటినీ అక్కడికక్కడే దాచేసాడు, మాయంచేసేసాడు. ఆటలాడడంలో గానీ ఆడించడంలో గాని ఆయన చాతుర్యం ఊహించరానిది. ఇంతలో అంతటి ఎనిమిది కన్నులున్న దేవతల పెద్ద బ్రహ్మదేవుడూ, మృతిచెందినవాడు బ్రతికి వచ్చినట్లు, తేరుకుని తెప్పరిల్లాడు. కాళ్లు చేతులు కదలించి చూసుకున్నాడు. తరువాత కళ్ళు విప్పి చూడడానికి శక్తి వచ్చింది. ముందు వైపు వెనుక వైపు చూసుకున్నాడు. తలపైకెత్తి చూసుకున్నాడు. అన్ని దిక్కులకూ చూసాడు. అప్పుడు అన్ని చోట్ల పరిశీలనగా చూసాడు. ఎదుట బృందావనం కనిపించింది. కృష్ణుడు ఉండడం వలన నరులు, పక్షులు, జంతువులు, తమ తమ జాతి సహజమైన శత్రుత్వాలను మరచి తిరుగుతూ ఉండడం గమనించాడు. ఆ బృందావనంలో సిరి సంపదలు ఉన్నాయి. అందులో ఉన్న వారెవరికి కామక్రోధాలు లేవు. ఆ బృందావనం చూసాడు బ్రహ్మదేవుడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: