Wednesday, November 7, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 42

10.1-515-చ.
కొడుకుల వేణునాదములు గొబ్బున వీనులకుం బ్రియంబు లై
ముడిపడ లేచి యెత్తుకొని మూర్కొని తల్లులు గౌగలించుచుం
జడిగొనఁ జేపువచ్చి తమచన్నుల యందు సుధాసమంబు లై
వెడిలెడి పాలు నిండుకొనువేడుక నిచ్చిరి తత్సుతాళికిన్.
10.1-516-వ.
మఱియుఁ దల్లు లుల్లంబులం బెల్లుగ వెల్లిగొనిన వేడుకలం దమనందనులకు నలుంగు లిడి, మజ్జనంబులు గావించి, గంధంబు లలంది తొడవులు దొడిగి నిటలతటంబుల రక్షాతిలకంబులు పెట్టి, సకలపదార్థసంపన్నంబులైన యన్నంబు లొసంగి సన్నములు గాని మన్ననలు చేసిరి.

భావము:
గోపబాలకుల తల్లులు కొడుకుల వేణునాదాలు విన్నారు. అవి వీనులవిందుగా వినిపించి వారి మనస్సులు పరవశించాయి. వెంటనే ఆ తల్లులు లేచి కుమారులను కౌగిలించుకుని శిరస్సులను మూర్కొన్నారు. వారి పాలిళ్ళు అందు పాలు ఉవ్వెత్తుగా చేపుకుని వచ్చాయి. గోపికలు అమృతంతో సమాన మైన ఆ పాలను నిండైన ప్రేమతో కొడుకులకు త్రాగించారు. పిమ్మట, ఆ గోపికా తల్లుల హృదయాలు ఆనందంతో పరవళ్ళు తొక్కగా వారు ఎంతో వేడుకతో కొడుకులకు నలుగుపెట్టి తలంటి స్నానాలు చేయించారు; గంధాలు పూసారు; చక్కని ఆభరణాలు అలంకరించారు; నుదిటిపై రక్షా తిలకాలు పెట్టారు; అన్ని రకాల పదార్థాలతోనూ భోజనాలు పెట్టారు; ఎంతో ప్రేమతో వారిని ఆదరించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=71&padyam=515

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: