10.1-527-సీ.
చన్ను మానిన యట్టి శాబకశ్రేణిపై;
గోగణంబులకును గోపకులకు
నిబ్బంగి వాత్సల్య మెబ్బంగి నుదయించె? ;
హరిఁ దొల్లి మన్నించునట్లు వీరు
మన్నించు చున్నారు మమతఁ జేయుచుఁ బ్రీతి;
నంబుజాక్షునిఁ గన్న యట్లు నాకుఁ
బ్రేమయయ్యెడి, డింభబృందంబుఁ గనుఁగొన్న;
నిది మహాద్భుత మెందు నెఱుఁగరాదు
10.1-527.1-తే.
మనుజ దైవత దానవ మాయ యొక్కొ?
కాక నా భర్త యగుచున్న కమలనయను
మాయయో గాక యితరులమాయ నన్నుఁ
గలఁప నోపదు; విభుమాయ కాఁగ నోపు.
భావము:
“తల్లిపాలు విడిచిన వయస్సులో ఉన్న బిడ్డల మీదా దూడల మీదా గోపకులకు ఆవులకు ఇంత అధికంగా వాత్సల్యం ఎలా పుట్టుకొచ్చింది; వీరు ఇదివరకు కృష్ణుని ఎడల మమకారంతో ఎంత ప్రేమ చూపేవారో, ఇప్పుడు తమ బిడ్డలపైన ఆ విధమైన ప్రేమ చూపుతున్నారు. నాకు కూడ ఈ బిడ్డలను లేగలను చూస్తుంటే కృష్ణుని చూసినట్లే ప్రేమా, ఇష్టాలు కలుగుతున్నాయి. ఇది ఏమిటో మహా అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఇలా ఎన్నడూ ఎరుగను. మానవులు గానీ దానవులు దేవతలు కానీ చేసిన మాయ కాదు కదా. లేక నా స్వామి అయిన విష్ణుమూర్తి యొక్క మాయ యేమో. నా స్వామి మాయే అయి ఉంటుంది.”
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment