Thursday, November 8, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 43

10.1-517-క.
ఏ తల్లుల కే బాలకు
లే తెఱఁగునఁ దిరిగి ప్రీతి నెఁసగింతురు ము
న్నా తల్లుల కా బాలకు
లా తెఱఁగునఁ బ్రీతిఁ జేసి రవనీనాథా!
10.1-518-వ.
ఆ సమయంబున.
10.1-519-ఉ.
పాయని వేడ్కతో నునికిపట్టులకుం జని గోవులెల్ల నం
బే యని చీరి హుమ్మనుచుఁ బేరిచి మూర్కొని పంచితిల్లి పె
ల్లై యతిరేకమై పొదుగులం దెడలేక స్రవించుచున్న పా
లాయెడ నాకుచున్ సుముఖలై యొసఁగెన్ నిజవత్సకోటికిన్.


భావము:
ఓ పరీక్షిన్మహారాజా! ఇంతకు ముందు ఏ బాలకులు ఏ తల్లులకు ఏ యే విధంగా ఆనందం కలిగించారో; ఇప్పుడు అలాగే ఆ యా బాలకులు ఆ యా తల్లులకు అ యా విధాలైన ఆనందాలు కలిగించారు. ఆ సమయంలో దొడ్లలో ఉన్న ఆవులు తమ దూడలను చూడగానే అంబా అంటూ బిడ్డలను పిలిచాయి; హుమ్మంటూ దూడలను వాసన చూసి, ఆనందంతో చటుక్కున మూత్రాలు కార్చాయి; ప్రేమతో దూడలను నాకుతూ, పొదుగుల నుండి కురుస్తున్న పాలను లేగదూడలకు త్రాగించాయి.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: