Wednesday, November 7, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 41

10.1-513-క.
మరలుపు మనియెడు కర్తయు
మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్
పరికింపఁ దాన యై హరి
మరలం జనె లీలతోడ మందకు నధిపా!
10.1-514-వ.
ఇట్లు బాలవత్సరూపంబులతో విహరించుచు మందకు వచ్చి వారివారి దొడ్ల నయ్యై వత్సంబుల ముందఱి కందువల నిలిపి, తత్తద్బాలరూపంబుల నందఱి గృహంబులం బ్రవేశించి వేణునాదంబులు చేసిన.


భావము:
విచిత్రంగా మందలోని పశువులను తమ ఇంటి వైపు తోలమని చెప్పేవాడు తానే, అలా తోలుతున్న గొల్లపిల్లలు తానే, అలా తోలబడి తమ ఇళ్ళకు వెళ్తున్న పశువులు తానే అయ్యి ఆ శ్రీహరి గొప్పవినోదంగా రేపల్లెకు వెళ్ళాడు.
సూత్రధారి పాత్రధారి అభేదమా జీవాత్మ పరమాత్మల అభేదమా, ఆహా! ఏమి లీల! ఇలా సమస్తమైన బాలురు, లేగలు యొక్క స్వరూపాలు అన్నీ తానే ధరించి విహరిస్తూ గోకులానికి తిరిగివచ్చి, వారి వారి దొడ్లలో ఆయా దూడలను ఆయా స్థానాలలో కట్టేసి, ఆయా బాలకుల స్వరూపంలో ఆయా ఇళ్ళల్లో ప్రవేశించి వారి వారి వేణువుల ద్వారా వేణునాదం వినిపించసాగాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: