Saturday, December 1, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 61

10.1-548-సీ.
“శంపాలతికతోడి జలదంబు కైవడి; 
మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ
కమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ; 
వేణుచిహ్నంబుల వెలయువాని
గుంజా వినిర్మిత కుండలంబులవాని; 
శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ
వనపుష్పమాలికావ్రాత కంఠమువాని; 
నళినకోమల చరణములవానిఁ
10.1-548.1-ఆ.
గరుణ గడలుకొనిన కడగంటివాని గో
పాలబాలుభంగిఁ బరగువాని
నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని
నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!


భావము:
“మెరపుతీగతోకూడిన మేఘంవలే నీ శరీరం బంగారురంగు ఉత్తరీయంతో ప్రకాశిస్తున్నది. నీ చేతిలో ఉన్న చలిది ముద్ద మృదువుగా ఎంతో అందంగా ఉంది. వెదురుకర్ర, కొమ్ముబూర, మురళి మొదలైనవి అలంకారాలవలె కలిగి ప్రకాశిస్తున్నావు. ఏనుగు దంతంతో చక్కగా చేసిన నీ కుండలాలు; నెమలి పింఛంతో చుట్టబడిన శిరస్సు; అడవిపూల మాలికతో అలంకరించబడిన నీ కంఠం; తామరపూవులా సున్నితమైన నీ పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. అదిగో కడగంటితో నన్ను చూస్తున్న నీ చూపులో కరుణ తొణికిసలాడుతోంది. నీ గోపాలబాల రూపాన్ని నేను స్తుతిస్తూ ఉంటే, నన్ను చూసి నవ్వుతున్న నీ మోము చాలా రమణీయంగా ఉంది. కమలదళాలవంటి కన్నులకల నీవు నన్ను కన్నతండ్రివని ఇప్పుడు గుర్తించాను. ఓ విష్ణుమూర్తీ! నీకు మ్రొక్కి నిన్ను సేవించుకుంటున్నాను.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: