10.1-540-ఉ.
ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోక ము
ద్ధీపిత మయ్యె నట్టి విభుతేజముఁ గన్నులఁ జక్కఁ జూడఁగా
నోపక పారవశ్యమును నొందుచు సంస్తిమితాఖిలేంద్రియుం
డై పరమేష్టి మైమఱచె నప్పుడు చిత్రపురూపుకైవడిన్.
10.1-541-వ.
ఇట్లు మాయాతీతుండును, వేదాంత విజ్ఞాన దుర్లభుండును, స్వప్రకాశానందుండునునైన తన బాహుళ్యంబుఁ జూచి నివ్వెఱ పడిన బ్రహ్మంగని యీశ్వరుండు.
భావము:
ఈసృష్టి అంతటికి పరముడైన ఈశ్వరుడు విష్ణుమూర్తి. తేజస్సు అనేది అతని నుండే పుట్టినది. దానివలన చరాచరమైన ఈ సృష్టి అంతా రూపొంది కాంతిమంతమై కళ్ళకు కనపడుతోంది. ఆ తేజస్సులో బ్రహ్మదేవుడు ఒక భాగం మాత్రమే కనుక ఆ తేజస్సును బ్రహ్మదేవుడు కన్నులారా చూడలేకపోయాడు. అతడు పరవశించి పోయాడు. అన్ని ఇంద్రియాలూ వ్యాపార శూన్యములు అయిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు బొమ్మగీసినట్లు ఒడలు తెలియక నిశ్చేష్టుడయి నిలబడిపోయాడు. ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడిని చూసాడు. మాయకు అతీతుడు వేదాంతాలు చదివినంత మాత్రాన దొరకని వాడు, తన ప్రకాశములో తాను ఆనందమై ఉన్నవాడు, అయిన పరబ్రహ్మ విశ్వరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు నివ్వెరపోవడం గమనించాడు. గమనించి. . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=73&padyam=540
// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment