Sunday, November 11, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 46

10.1-524-వ.
అంత గోపకులు గోవుల వారింప నలవి గాక దిగ్గన నలుకతోడి సిగ్గు లగ్గలంబుగ దుర్గమ మార్గంబున వానివెంట నంటి వచ్చి లేఁగల మేపుచున్న కొడుకులం గని.
10.1-525-ఉ.
అయ్యలఁ గంటి మంచుఁ బులకాంకురముల్ వెలయంగఁ గుఱ్ఱలం
జయ్యన డాసి యెత్తికొని సంతస మందుచుఁ గౌగలింపఁ దా
రయ్యెడ నౌదలల్ మనము లారఁగ మూర్కొని ముద్దు చేయుచున్
దయ్య మెఱుంగు; గోపకులు దద్దయు నుబ్బిరి నిబ్బరంబుగన్.

భావము:
ఇంతవరకూ తమ మాటలను ఆవులు ధిక్కరించేవి కాదు. అలాంటిది అలా వచ్చిన ఆవులను ఆపుచేయడం, గోపకులకు సాధ్యం కాలేదు. వారికి కోపంతోపాటు సిగ్గు కూడా కలిగింది. వాటి వెనుకనే తుప్పల వెంట బండల పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. లేగలను మేపుతున్న తమ బిడ్డలను చూసారు. మమతలతో వారు కోపాలు సిగ్గులు అన్నీ మరచిపోయారు. “మా చిన్ని అయ్యలను చూడగలిగాము” అంటూ బిడ్డల వద్దకు చేరి వారిని ఎత్తుకున్నారు. ఒడలంతా పులకలెత్తుతుండగా సంతోషంతో కౌగలించుకుని తలలను మూర్కొని ముద్దులు చేసారు. బిడ్డలలో ఉన్న దైవాన్ని తెలుసుకున్నారా అన్నట్లు ఎంతో సంతోషంతో పొంగిపోయారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=71&padyam=525

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: