Monday, November 5, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 40

10.1-511-మ.
కరముల్ పాదములున్ శిరంబు లవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాం
తరముల్ ముక్కులు గన్నులుం శ్రవణముల్ దంతాదులున్ దండ కాం
బర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన త
త్పరతల్ వీడ్వడకుండఁ దాల్చె విభుఁ డా వత్సార్భకాకారముల్.
10.1-512-క.
రూపంబు లెల్ల నగు బహు
రూపకుఁ డిటు బాలవత్సరూపంబులతో
నేపారు టేమి చోద్యము? 
రూపింపఁగ నతని కితరరూపము గలదే?


భావము:
ఇలా అయితే గోపికలు సంతోషిస్తారు కదా అనుకుంటూ, కృష్ణబాలుడు ఆ యా లేగదూడల, గోపబాలకుల రూపాలను అన్నీ తానే ధరించాడు. అన్ని అవయవాదులు ఆ యా బాలుర పోలికల్లోనే ఉన్నాయి. అంతే కాకుండా, ఆ బాలురు ధరించే చేతికఱ్ఱలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ముబూరాలు, ఆభరణాలు, వారి వయస్సులు, గుణాలు, మాటలాడే యాస ఏ ఒక్కటీ వదలకుండా సంపూర్ణంగా ఆ యా బాలుర, లేగల స్వరూపాలు అన్నీ తనే ధరించాడు. ఈ జగన్నాటకంలో అందరి రూపాలూ ధరించే అంతర్యామి స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడు కదా. ఆ మహానటుడు ఇలా బాలుర యొక్క, లేగల యొక్క రూపాలు ధరించడంలో ఏమి ఆశ్చర్యం ఉంది. ఏ రూపంలో అయినా ఉన్నవాడు అతడే. జాగ్రత్తగా గమనిస్తే అతడు సర్వాత్మకుడు రూపాతీతుడు కనుక అతనికి రూపం అన్నది వేరే ఉండదు కదా. అవును, ఆ జగన్నాటక సూత్రధారి ధరించలేని పాత్ర ఏముంటుంది.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: