10.1-36-క.
ఎందును గాలము నిజ మని
పందతనంబునను బుద్ధిఁబాయక ఘనులై
యెందాఁక బుద్ధి నెగడెడి
నందాఁకఁ జరింపవలయు నాత్మబలమునన్.
10.1-37-వ.
అని నిశ్చయించి.
10.1-38-సీ.
ఆపన్నురాలైన యంగన రక్షింప;
సుతుల నిచ్చెద నంట శుభము నేడు;
మీ దెవ్వ డెఱుగును? మెలఁత ప్రాణంబుతో;
నిలిచిన మఱునాడు నేరరాదె?
సుతులు పుట్టిర యేని సుతులకు మృత్యువు;
వాలాయమై వెంట వచ్చెనేని
బ్రహ్మచేతను వీఁడు పా టేమియును లేక;
యుండునే? సదుపాయ మొకటి లేదె?
10.1-38.1-తే.
పొంత మ్రాఁకులఁ గాల్పక పోయి వహ్ని
యెగసి దవ్వులవాని దహించు భంగిఁ
గర్మవశమున భవమృతికారణంబు
దూరగతిఁ బొందు; నిఁక నేల తొట్రుపడఁగ?
భావము:
“మనుషులకు బేలతనం పనికి రాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవం అయినది అనే వివేకాన్ని పిరికిదనంతో వదల రాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ది ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకూ ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి.” అని వసుదేవుడు ఇలా గట్టిగా నిశ్చయించుకొని.... “ఆపదపాలైన దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చేస్తాను అనడం ప్రస్తుతానికి తగిన పని. ముందు ఏమి జరగబోతున్నదో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికి ప్రాణాలతో నిలచి ఉంటే, రేపటికి మరోమార్గం లభించదా? పుత్రులే పుట్టి వారికి వెనువెంటనే మృత్యువు కూడా వస్తేరానీ. అందాకా వీడు బ్రహ్మదేవుడి చేత ఏ ఆపద పొందకుండానే ఉంటాడా? అప్పటికి తగ్గ ఉపాయం ఏదో ఒకటి ఉండదా. అడవిలో పుట్టిన దావాగ్ని ప్రక్కనున్న చెట్లను విడచి ఎగసిపడి ఎక్కడో దూరాన ఉన్న చెట్లను దహించి వేస్తుంది. అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యువు అనే కారణాలు దూరదూరంగా పోతూ ఉంటాయి. ఇంతతెలిసీ ఇంకా తొట్రుపడడం ఎందుకు?
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=38
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment