Tuesday, July 25, 2017

దక్ష యాగము - 97


4-207-వ.
“అనఘా! యేనును బ్రహ్మయు శివుండు నీ జగంబులకుఁ గారణభూతులము; అందు నీశ్వరుఁడును, నుపద్రష్టయు స్వయంప్రకాశుండు నైన నేను గుణమయం బయిన యాత్మీయ మాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతుభూతంబు లగు తత్తత్క్రియోచితంబు లయిన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందుచుండు; దట్టి యద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నా యందు నజ భవాదులను భూతగణంబులను మూఢుం డగువాడు వేఱుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేఱుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపఁడు; కావున మా మువ్వుర నెవ్వండు వేఱు చేయకుండు వాఁడు కృతార్థుండు" అని యానతిచ్చిన దక్షుండును.
4-208-క.
విని విష్ణు దేవతాకం
బనఁగాఁ ద్రికపాలకలిత మగు నా యాగం
బునఁ దగ నవ్విష్ణుని పద
వనజంబులు పూజ చేసి వారని భక్తిన్.
4-209-వ.
మఱియును.

టీకా:
అనఘా = పుణ్యుడ; ఏనున్ = నేను; బ్రహ్మయు = బ్రహ్మదేవుడు; శివుండున్ = శివుడు; ఈ = ఈ; జగంబుల్ = లోకముల; కున్ = కు; కారణభూతులము = కారణము యైనవారము; అందున్ = అందులో; ఈశ్వరుండను = ప్రభువును; ఉపద్రష్టయు = పర్యవేక్షకుడను; స్వయంప్రకాశుండును = స్వంతమైన ప్రకాశము కలవాడను; ఐన = అయిన; నేను = నేను; గుణ = త్రిగుణ; మయంబున్ = కూడినది; అయిన = అయిన; ఆత్మీయ = నా యొక్క; మాయన్ = మాయను; ప్రవేశించి = చేరి; జనన = పుట్టుక; వృద్ధి = వృద్ధి; విలయంబుల = విలయముల; కున్ = కు; హేతుభూతంబులు = కారణము యైనవి; అగు = అయిన; తత్తత్ = అయా; క్రియా = పనులకు; ఉచితంబులు = తగునవి; అయిన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆది = మొదలగు; నామధేయంబులన్ = పేర్లను; ఒందుచున్ = పొందుతూ; ఉండుదు = ఉంటాను; అట్టి = అటువంటి; అద్వితీయ = రెండవదిలేనట్టి, తిరుగులేని; బ్రహ్మ = పరబ్రహ్మ; రూపకుండను = రూపము కలవాడను; ఐన = అయిన; నా = నా; అందున్ = నుండి; అజ = బ్రహ్మదేవుడు; భవ = శివుడు; ఆదులను = మొదలైనవారిని; భూత = జీవ; గణంబులను = జాలములను; మూఢుండు = తెలివిలేనివాడు; అగువాడు = అయినవాడు; వేఱుగా = వేరువేరుగా; చూచు = చూచును; మనుజుండు = మానవుడు; శరీరంబున్ = దేహమున; కున్ = కు; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆదులు = మొదలగునవి; వేఱుగా = వేరువేరుగా; తలంపని = తలచని; చందంబునన్ = వలెనే; మత్ = నా యొక్క; భక్తుండు = భక్తుడు; అగువాడు = అయినవాడు; నా = నా; అందున్ = ఎడల; భూత = జీవ; జాలంబున్ = గణములను; భిన్నంబు = వేరు; కాన్ = అగునట్లు; తలంపడు = అనుకొనడు; కావునన్ = అందుచేత; మా = మా; మువ్వురన్ = ముగ్గురను; ఎవ్వండు = ఎవరైతే; వేఱుచేయకుండు = వేరుగాచూడకుండునో; వాడు = వాడు; కృతార్థుండు = ప్రయోజనము తీర్చుకొన్నవాడు; అని = అని; ఆనతిచ్చిన = శలవుచేసిన; దక్షుండును = దక్షుడును. విని = విని; విష్ణు = విష్ణువు; దేవతాకంబున్ = దేవతగాకలది; అనగాన్ = అన్నట్లుగా; త్రికపాల = మూడు కుండలు; కలితము = కలిగినది; అగు = అయిన; ఆ = ఆ; యాగంబునన్ = యజ్ఞములో; తగన్ = తగినట్లు; ఆ = ఆ; విష్ణుని = నారాయణుని; పద = పాదములు అనెడి; వనజంబులు = పద్మములు {వనజము - వనము (నీరు) యందు జము (పుట్టినది), పద్మము}; పూజ = పూజ; చేసి = చేసి; వారని = హద్దులేని; భక్తిన్ = భక్తితో. మఱియును = ఇంకను.

భావము:
“పుణ్యాత్ముడా! నేనూ, బ్రహ్మా, శివుడూ ఈ లోకాలకు కారణభూతులం. వారిలో నేను ఈశ్వరుడను, సాక్షిని, స్వయంప్రకాశుడను అయి త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయ కార్యాలకు కారణాలైన ఆయా పనులకు బ్రహ్మ రుద్రుడు మొదలైన నామాలను పొందుతాను. నాకంటె వేరైన పరబ్రహ్మ రూపం లేదు. బ్రహ్మ శివుడు మొదలైనవారిని, జీవకోటిని బుద్ధిహీనుడు నాకంటె వేరుగా చూస్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలైన అవయవాలను తన శరీరం కంటె వేరుగా చూడనట్లు నా భక్తుడు జీవులను నాకంటె వేరుగా భావింపడు. కనుక మా ముగ్గురిని ఎవడైతే వేరు వేరుగా చూడడో వాడే ధన్యుడు” అని ఉపదేశించగా దక్షుడు... (విష్ణువు ఉపదేశాన్ని దక్షుడు) విని విష్ణుదేవతాకమైన త్రికపాల పురోడాశ మనే యజ్ఞాన్ని చేసి విష్ణుమూర్తి పాదపద్మాలను పరమభక్తితో పూజించాడు. ఇంకా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=208

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: