Saturday, July 29, 2017

శ్రీ కృష్ణ జననం - 3

10.1-24-వ.
అని యిట్లాకాశవాణి పలికిన నులికిపడి భోజకుల పాంసనుండైన కంసుండు సంచలదంసుండై యడిదంబు బెడిదంబుగాఁ బెఱికి, జళిపించి దెప్పరంబుగ ననుజ కొప్పుఁ బట్టి కప్పరపాటున నొప్పఱం దిగిచి యొడిసి పట్టి, తోఁబుట్టువని తలంపక తెంపుఁ జేసి తెగవ్రేయ గమకించు సమయంబున వసుదేవుండు డగ్గఱి.
10.1-25-క.
ఆ పాపచిత్తు మత్తుం
గోపాగ్ని శిఖానువృత్తుఁ గొనకొని తన స
ల్లాపామృతధారా వి
క్షేపణమునఁ గొంత శాంతుఁ జేయుచుఁ బలికెన్.
10.1-26-ఉ.
అన్నవు నీవు చెల్లెలికి; నక్కట! మాడలు చీర లిచ్చుటో? 
మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో? 
"మిన్నుల మ్రోతలే నిజము, మే"లని చంపకు మన్న మాని రా
వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేడెదన్.
10.1-27-వ.
అదియునుం గాక.

భావము:
ఇలా ఆకాశవాణి పలుకడంతో భోజవంశాన్ని పాడుచేయడానికి పుట్టిన కంసుడు ఉలిక్కిపడ్డాడు. ఆ దుర్మార్గుడు భుజాలు అదురుతుండగా భయంకరంగా కత్తిదూసి తొట్రుపాటుతో చెల్లెలి కొప్పు పట్టుకుని రథం మీంచి క్రిందికి లాగాడు. తోడపుట్టినది అని కూడా చూడకుండా తెగించి ఆమెను చంపబోతున్న కంసుడికి వసుదేవుడు అడ్డుపడ్డాడు. ఆ కంసుడు అసలే పాపపుబుద్ధి కలవాడు. పైగా మద మెక్కి మైమరచి ఉన్నాడు. ఆగ్రహావేశంతో అగ్నిజ్వాల లాగా మండిపడుతున్నాడు. వసుదేవుడు అమృతధారల వంటి తన చల్లని మాటల చేత అతనిని కొంత శాంతింప చేస్తూ ఇలా అన్నాడు. “బావా! కంసా! నీవు ఈ చిన్నదానికి అన్నగారివి కదా. నీ చెల్లెలికి ధనం ఇవ్వాలి చీరలు పెట్టాలి; ఆడపడుచు అని గౌరవించాలి; మధురమైన మాటలతో ఆదరించాలి; అంతేకానీ, అయ్యో ఇదేమిటి ఏవో గాలిమాటలు విని అవే నిజం అనుకుని ఈ అమాయకురాలిని వధించబోవడం సరికాదు కదా. చంపవద్దు బావా! దయచేసి వెనక్కు వచ్చేయి. ఓర్పుతెచ్చుకో. ఇది నీ వీరత్వానికి తగిన పని కాదు. ఆమెను వధించ వద్దు. నాయనా! నామాట విను నిన్ను వేడుకుంటున్నాను. అంతే కాకుండా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=4&padyam=26

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: