Sunday, July 30, 2017

శ్రీ కృష్ణ జననం - 2

10.1-22-క.
పగ్గములు వదలి వేగిర
మగ్గలముగ రథముఁ గడపు నా కంసుడు లో
బెగ్గిలి యెగ్గని తలఁపగ 
దిగ్గన నశరీరవాణి దివి నిట్లనియెన్.
10.1-23-క.
తుష్ట యగు భగిని మెచ్చఁగ
నిష్టుఁడ వై రథము గడపె; దెఱుగవు మీఁదన్
శిష్ట యగు నీతలోదరి 
యష్టమగర్భంబు నిన్ను హరియించుఁ జుమీ.

భావము:
కంసుడు గుఱ్ఱాల పగ్గాలు సడల్చి రథం వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేటట్లు అశరీరవాణి ఆకాశంలో నుండి ఇలా పలికింది. “సంతుష్టురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు. కానీ, ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు.. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమగర్భంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు సుమా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=3&padyam=23

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: