Sunday, July 30, 2017

శ్రీ కృష్ణ జననం - 4

10.1-28-మ.
చెలియల్; కన్నియ; ముద్దరా; లబల; నీ సేమంబె చింతించు ని
ర్మల; దీనిన్ బయలాడుమాటలకు నై మర్యాదఁ బోఁదట్టి, స
త్కుల జాతుండవు పుణ్యమూర్తి వకటా! కోపంబు పాపంబు; నె
చ్చెలి నోహో! తెగవ్రేయఁ బాడి యగునే? చింతింపు భోజేశ్వరా!
10.1-29-సీ.
మేనితోడన పుట్టు మృత్యువు జనులకు; 
నెల్లి నేఁడైన నూఱేండ్ల కైనఁ
దెల్లంబు మృత్యువు దేహంబు పంచత; 
నందఁ గర్మానుగుండై శరీరి 
మాఱుదేహముఁ నూఁది, మఱి తొంటి దేహంబుఁ; 
బాయును దన పూర్వ భాగమెత్తి 
వేఱొంటిపైఁ బెట్టి వెనుకభాగం బెత్తి; 
గమనించు తృణజలూకయును బోలె;
10.1-29.1-ఆ.
వెంటవచ్చు కర్మవిసరంబు; మును మేలు 
కన్నవేళ నరుడు గన్న విన్న 
తలఁపఁబడిన కార్యతంత్రంబు కలలోనఁ
బాడితోడఁ గానఁబడిన యట్లు.

భావము:
ఈ నీ చెల్లెలు వట్టి అమాయకురాలు. అబల. నీ క్షేమాన్నేఎప్పుడూ ఆశిస్తుంది. ఏ పాపమూ ఎరుగనిది. ఇటువంటి ఈమెను ఆక్కడా ఇక్కడా వినబడే మాటలు పట్టుకుని చంపబోవడం న్యాయమేనా? కోపం మహాపాపం సుమా. పవిత్రమైన భోజవంశంలో పుట్టిన వాడివి. పుణ్యమూర్తివి. భోజవంశీయులు అందరికీ నాయకుడవు. ఇలాంటి నువ్వు ప్రియమైన సోదరిని సంహరించడం ధర్మమా? అయ్యో! ఇది నీప్రతిష్టకు భంగకరం కాదా? ఆలోచించి చూడు. జన్మము ఎత్తినవారికి ఆ శరీరం తోపాటే మృత్యువు కూడా పుట్టి ఉంటుంది. నేడో రేపో నూరేళ్ళకైనా మృత్యువు తప్పదు. మరణించడం అంటే శరీరం పంచభూతాలలో కలసిపోవడమే. ఆకుపురుగును చూడు శరీరం ముందు భాగం ఎత్తి మరోచోట పెట్టి వెనుకభాగం ఎత్తి ముందుకు లాక్కుంటుంది కదా. అలాగే శరీరం ధరించిన జీవుడు తన కర్మను అనుసరించి మరొక దేహం ఏర్పాటు చేసుకుని మరి ఉన్నశరీరం విడిచిపెడతాడు. మనకు మెలుకవగా ఉన్నప్పుడు మానవుడు చూచినవి విన్నవి ఆలోచించినవి అయిన పనులు కలలో చక్కగా కనపడినట్లు శరీరం విడువగానే కర్మవాసనలన్నీ ఆ జీవి వెంటవస్తాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=29

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: