Friday, July 14, 2017

దక్ష యాగము - 88

4-189-చ.
"కర చరణాదికాంగములు గల్గియు మస్తము లేని మొండెముం
బరువడి నొప్పకున్న గతిఁ బంకజలోచన! నీవు లేని య
ధ్వరము ప్రయాజులం గలిగి తద్దయు నొప్పక యున్న దీ యెడన్
హరి! యిటు నీదు రాక శుభ మయ్యె రమాధిప! మమ్ముఁ గావవే."
4-190-వ.
లోకపాలకు లిట్లనిరి.

టీకా:
కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆది = మొదలైన; అంగములు = అవయవములు; కల్గియు = ఉండియు; మస్తము = తల; లేని = లేని; మొండెమున్ = మొండెము; పరువడి = చక్కగా; ఒప్పకున్న = శోభిల్లకున్న; గతిన్ = విధముగ; పంకజలోచన = నారాయణ {పంకజలోచన - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; నీవు = నీవు; లేని = లేని; అధ్వరము = యజ్ఞము; ప్రయాజులన్ = యఙ్ఙపరికరములను; కలిగి = కలిగున్నప్పటికిని; తద్దయున్ = మిక్కిలి; ఒప్పక = శోభలేక; ఉన్నది = ఉన్నది; ఈ = ఈ; ఎడన్ = సమయమునందు; హరి = నారాయణ; ఇటు = ఈవిధముగ; నీదు = నీయొక్క; రాక = వచ్చుట; శుభము = మంచిది; అయ్యెన్ = అయినది; రమాధిప = నారాయణ {రమాధిప - రమ (లక్ష్మీదేవి) యొక్క అధిప (భర్త), విష్ణువు}; మమ్మున్ = మమ్ములను; కావవే = రక్షింపుము. లోకపాలకులు = లోకపాలకులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.

భావము:
“కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు అన్నీ ఉన్నా తలలేని మొండెము శోభిల్లదు. అలాగే ప్రయాజలు మొదలైన ఇతర అంగాలెన్ని ఉన్నా నీవు లేని యజ్ఞం శోభిల్లలేదు. ఇప్పటి నీ రాక శుభదాయకం. మధవా! మమ్ము కాపాడు.” లోకపాలకులు ఇలా అన్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=189

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: