4-180-వ.
ఇంద్రుఁ డిట్లనియె.
4-181-మ.
"దితి సంతాన వినాశ సాధన సముద్దీప్తాష్ట బాహా సమ
న్వితమై యోగిమనోనురాగ పదమై వెల్గొందు నీ దేహ మా
యత మైనట్టి ప్రపంచముం బలెను మిథ్యాభూతముం గామి శా
శ్వతముంగా మదిలోఁ దలంతు హరి! దేవా!దైవచూడామణీ!"
4-182-వ.
ఋత్విక్పత్ను లిట్లనిరి.
టీకా:
ఇంద్రుడు = ఇంద్రుడు; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను. దితి = దితి యొక్క; సంతాన = సంతానమునకు; వినాశ = వినాశనముచేయుటకు; సాధన = సాధనములు, ఆయుధములతో; సమ = చక్కగా; ఉద్దీప్త = ప్రకాశిస్తున్న; అష్ట = ఎనిమిది (8); బాహా = చేతులతో; సమ = చక్కగా; ఆన్వితము = కూడినది; ఐ = అయ్యి; యోగి = యోగుల; మనసు = మనసులందలి; అనురాగ = కూరిమికి; పదము = ఆస్థానము; ఐ = అయ్యి; వెల్గొందు = ప్రకాశించెడి; నీ = నీ యొక్క; దేహము = దేహము; ఆయతము = విస్తారము; ఐనట్టి = అయినట్టి; ప్రపంచమున్ = లోకము; వలెను = వలె; మిథ్యాభూతంబు = అసత్యమైనది; కామిన్ = కాపోవుట వలన; శాశ్వతమున్ = శాశ్వతమైనది; కాన్ = అగునట్లు; మది = మనసు; లోన్ = లో; తలంతున్ = అనుకొనెదను; హరి = నారాయణ; దేవా = నారాయణ; దైవచూడామణీ = నారాయణ {దైవచూడామణీ - దైవములలో శిరోమణి వంటివాడు, విష్ణువు}. ఋత్విక్ = ఋత్విక్కుల; పత్నులు = భార్యలు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.
భావము:
ఇంద్రుడు ఇలా అన్నాడు. “రాక్షసులను సంహరించే ఆయుధాలతో దేదీప్యమానంగా ప్రకాశించే ఎనిమిది బాహువులతో కూడి, యోగుల అంతరంగాలకు ఆనందం కల్గించే నీ దేహం శాశ్వతమైనది. ఈ ప్రపంచం లాగా అశాశ్వతమైనది కాదు. హరీ! దేవా! దేవతాచక్రవర్తీ! అటువంటి నీ స్వరూపాన్ని నేను నా మనస్సులో భావిస్తున్నాను.” ఋత్విక్కుల భార్యలు ఇలా అన్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=181
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment