Thursday, July 6, 2017

దక్ష యాగము - 81:

4-175-చ.
"వరద! నిరీహ యోగిజన వర్గసు పూజిత! నీ పదాబ్జముల్
నిరతము నంతరంగమున నిల్పి భవత్సదనుగ్రహాదిక
స్ఫురణఁ దనర్చు నన్ను నతిమూఢు లవిద్యులు మున్నమంగళా
వరణుఁ డటంచుఁ బల్కిన భవన్మతి నే గణియింప నచ్యుతా!"
4-176-వ.
భృగుం డిట్లనియె.

టీకా:
వరద = నారాయణ {వరదుడు - వరములను దుడు (ఇచ్చువాడు), విష్ణువు}; నిరీహయోగిజనవర్గసుపూజిత = కోరికలులేని {నిరీహయోగి జనవర్గసుపూజితుడు - నిర్ (లేని) ఈహ (కోరికలు కల) యోగి (యోగులైన) జన (వారి) వర్గ (సమూహము)చే పూజితుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అబ్జములు = పద్మములు; నిరతము = ఎల్లప్పుడు; అంతరంగమునన్ = హృదయమున; నిల్పి = ధరించి; భవత్ = నీ యొక్క; సత్ = మంచి; అనుగ్రహ = అనుగ్రహము; ఆదిక = మొదలగు వాని; స్పురణన్ = స్పురణతో; తనర్చు = అతిశయించు; నన్ను = నన్ను; అతి = మిక్కిలి; మూఢులు = మూర్ఖులు; అవిద్యులు = అవిద్య కలవారు; మున్న = ముందు; అమంగళ = అశుభమైనవి; ఆవరణుడు = ఆవరించి ఉన్నవాడు; అటంచున్ = అంటూ; పల్కిన = అంటుంటే; భవత్ = నిన్ను స్మరించెడి; మతిన్ = మనసుతో; నేన్ = నేను; గణియింపన్ = ఎంచను; అచ్యుత = నారాయణ {అచ్యుత - చ్యుతము (పతనము)లేనివాడు, విష్ణువు}. భృగుండు = భృగువు; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను.

భావము:
“వరదా! పరమయోగి పూజితుడవైన అచ్యుతా! నీ పాదపద్మాలను నిత్యం మనస్సులో నింపుకొని నీ సంపూర్ణ దయను పొందిన నన్ను చూచి బుద్ధిహీనులు ‘అమంగళమూర్తి’ అని నిందిస్తారు.అయినా ఆ నిందను నేను లెక్కచేయను.” భృగుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=175

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: