Tuesday, August 1, 2017

శ్రీ కృష్ణ జననం - 8

10.1-39-క.
కొడుకుల నిచ్చెద నని సతి
విడిపించుట నీతి; వీఁడు విడిచిన మీఁదం
గొడుకులు పుట్టినఁ గార్యము
తడఁబడదే? నాటి కొక్క దైవము లేదే?
10.1-40-క.
ఎనిమిదవ చూలు వీనిం
దునుమాడెడి నంచు మింటఁ దోరపుఁబలుకుల్ 
వినఁబడియె; నేల తప్పును? 
వనితను విడిపించు టొప్పు వైళం బనుచున్,
10.1-41-క.
తిన్నని పలుకులు పలుకుచుఁ 
గ్రన్నన తగఁ బూజ చేసి కంసు నృశంసున్
మన్నించి చిత్త మెరియఁ బ్ర
సన్నాననుఁ డగుచుఁ బలికె శౌరి నయమునన్.

భావము:
పుట్టబోయే కొడుకులను ఇస్తాను అని మాట ఇచ్చి, భార్యను విడిపించడం తెలివైనపని. వీడిప్పుడు వదిలితే తరువాత కొడుకులు పుట్టే నాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏ దైవమో అడ్డుపడక పోతుందా? ఎనిమిదవ గర్భంలో పుట్టేవాడు వీడిని సంహరిస్తాడని మాటలు సూటిగా వినువీధి నుంచి వినపడ్డాయి. అవి ఎందుకు తప్పుతాయి. త్వరగా నాభార్యను విడిపించడం మంచిది” అని ఆలోచించాడు వసుదేవుడు. మర్యాదతో కూడిన మంచిమాటలతో క్రూరుడైన కంసుని గౌరవించి పొగిడాడు. మనస్సులో మంటగా ఉన్నా వసుదేవుడు పైకి నవ్వుతున్న ముఖంతో అనునయంగా నేర్పుగా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=40

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: