4-194-వ.
శబ్దబ్రహ్మ యిట్లనియె.
4-195-చ.
"హరి! భవదీయ తత్త్వము సమంచితభక్తి నెఱుంగ నేను నా
సరసిజ సంభవాదులును జాలము; సత్త్వగుణాశ్రయుండవున్
బరుఁడవు నిర్గుణుండవును బ్రహ్మమునై తగు నీకు నెప్డు నిం
దఱముఁ జతుర్విధార్థ ఫలదాయక! మ్రొక్కెద మాదరింపవే."
4-196-వ.
అగ్నిదేవుం డిట్లనియె.
టీకా:
శబ్దబ్రహ్మ = శబ్దబ్రహ్మ {శబ్దబ్రహ్మ - ఆకాశమనబడుదేవుడు, పరాపశ్యంతిమధ్యమవైఖరి అనబడు నాలుగు వాక్కులుగ శబ్దబ్రహ్మ ఉచ్చరింపబడును}; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను. హరి = నారాయణ; భవదీయ = నీ యొక్క; తత్త్వము = స్వరూపము; సమ = చక్కగా; అంచిత = ఒప్పుతున్న; భక్తిన్ = భక్తితో; ఎఱుంగన్ = తెలియుటకు; నేనున్ = నేను; ఆ = ఆ; సరసిజసంభవ = బ్రహ్మదేవుడు; ఆదులును = మొదలైనవారమును; చాలము = సమర్థులముకాము; సత్త్వగుణాశ్రయుండవున్ = నారాయణుడవు {సత్త్వగుణాశ్రయుండు - సత్త్వగుణములను ఆశ్రయించి యుండువాడు, విష్ణువు}; పరుడవు = నారాయణుడవు {పరుడవు - సమస్తమునకు పరము (అతీతము) యైనవాడు, విష్ణువు}; నిర్గుణుండవును = నారాయణుడవు {నిర్గుణుడు - సత్త్వాది త్రిగుణములను లేనివాడు, విష్ణువు}; బ్రహ్మమున్ = నారాయణుడవు {బ్రహ్మము - పరబ్రహ్మస్వరూపుడు, విష్ణువు}; ఐ = అయ్యి; తగు = తగిన; నీకున్ = నీకు; ఎప్డును = ఎప్పుడును; ఇందఱమును = మేమందఱము; చతుర్విధఫలప్రదాయక = నారాయణ {చతుర్విధఫలప్రదాయక - చతుర్విధ (నాలుగు విధములైన) ఫల (పురుషార్థములను, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములను) ప్రదాయక (చక్కగానిచ్చువాడు), విష్ణువు}; మ్రొక్కెదము = నమస్కరించెదము; ఆదరింపవే = ఆదరింపుము. అగ్నిదేవుండు = అగ్నిదేవుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:
శబ్దబ్రహ్మ ఇలా అన్నారు. “హరీ! నీ అసలైన రహస్యాన్ని గ్రహించటానికి ఉత్తమ భక్తియుక్తులమైన నేనుగాని, బ్రహ్మ మొదలైనవారు గాని సమర్థులం కాదు. నీవు సత్త్వగుణానికి నిలయమైనవాడవు. పరాత్పరుడవు. నిర్గుణుడవు. పరబ్రహ్మ స్వరూపుడవు. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు విధాలైన పురుషార్థ ఫలాలను నీవు ప్రసాదిస్తావు. అటువంటి నీకు మేమంతా సంతతం నమస్కరిస్తున్నాము. మమ్ము ఆదరించు.” అగ్నిదేవుడు ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=195
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment