Sunday, July 30, 2017

శ్రీ కృష్ణ జననం - 5

10.1-30-క.
తన తొంటి కర్మరాశికి
ననుచరమై బహువికారమై మనసు వడిం
జను; నింద్రియముల తెరువులఁ
దనువులు పెక్కైనఁ జెడవు తన కర్మంబుల్.
10.1-31-ఆ.
జలఘటాదులందుఁ జంద్రసూర్యాదులు
గానబడుచు గాలిఁ గదలు భంగి 
నాత్మకర్మ నిర్మితాంగంబులను బ్రాణి
గదలుచుండు రాగకలితుఁ డగుచు.
భావము:
10.1-32-క.
కర్మములు మేలు నిచ్చును; 
గర్మంబులు గీడు నిచ్చు; గర్తలు దనకుం 
గర్మములు బ్రహ్మ కైనను; 
గర్మగుఁ డై పరులఁ దడవఁగా నేమిటికిన్?

భావము:
తన పూర్వకర్మలు అనుసరించి మనస్సు అనేక వికారాలు చెందుతూ, ఇంద్రియాల వెంట వేగంగా చరిస్తూ ఉంటుంది. ఎన్ని శరీరాలు ధరించినా తన కర్మలు మాత్రం ఎక్కడకీ పోవు. చంద్రబింబం సూర్యబింబం మొదలైనవి నీటికుండలు మొదలైనవాటిలో ప్రతిఫలిస్తూ గాలికి కదులుతూ ఉంటాయి. అలాగే ప్రాణి తన కర్మల చేత నిర్మించుకున్న శరీరాలలో ఆసక్తి చెంది సంచలిస్తూ ఉంటాడు. మంచి అయినా, చెడు అయినా ఎవరికైనా తాను చేసుకున్న కర్మల ఫలితంగానే వస్తుంది. బ్రహ్మదేవుడు అంతటివాడికి అయినా తన కర్మలే తన అనుభవానికి కర్తలు. కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెతకడం ఎందుకు?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=5&padyam=32

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: