4-169-ఉ.
ఆ నళినాయతాక్షుని యనంత పరాక్రమ దుర్నిరీక్ష్య తే
జో నిహతస్వదీప్తు లగుచున్నుతిసేయ నశక్తులై భయ
గ్లాని వహించి బాష్పములు గ్రమ్మఁగ గద్గదకంఠులై తనుల్
మ్రానుపడంగ నవ్విభుని మన్ననఁ గైకొని యెట్టకేలకున్.
4-170-వ.
నిటలతట ఘటిత కరపుటులై యమ్మహాత్ముని యపార మహిమం బెఱిఁగి నుతియింప శక్తులుగాక యుండియుఁ, గృతానుగ్రహవిగ్రహుం డగుటం జేసి తమతమ మతులకు గోచరించిన కొలంది నుతియింపఁ దొడంగిరి; అందు గృహీతంబు లగు పూజాద్యుపచారంబులు గలిగి బ్రహ్మాదులకు జనకుండును, సునంద నందాది పరమభాగవతజన సేవితుండును, యజ్ఞేశ్వరుండును నగు భగవంతుని శరణ్యునింగాఁ దలంచి దక్షుం డిట్లనియె; “దేవా! నీవు స్వస్వరూపంబునం దున్న యప్పు డుపరతంబులుగాని రాగాద్యఖిలబుద్ధ్యవస్థలచే విముక్తుండవును, నద్వితీయుండవును, జిద్రూపకుండవును, భయరహితుండవును నై మాయం దిరస్కరించి మఱియు నా మాయ ననుసరించుచు లీలామానుషరూపంబుల నంగీకరించి స్వతంత్రుండ వయ్యును, మాయా పరతంత్రుడవై రాగాది యుక్తుండునుం బోలె రామకృష్ణాద్యవతారంబులఁ గానంబడుచుందువు; కావున నీ లోకంబులకు నీవ యీశ్వరుండవనియు నితరులైన బ్రహ్మరుద్రాదులు భవన్మాయా విభూతు లగుటం జేసి లోకంబులకు నీశ్వరులుగా రనియును భేదదృష్టి గల నన్ను రక్షింపుము; ఈ విశ్వకారణు లైన ఫాలలోచనుండును బ్రహ్మయు దిక్పాలురును సకల చరాచర జంతువులును నీవ; భవద్వ్యతిరిక్తంబు జగంబున లే" దని విన్నవించినం దదనంతరంబ ఋత్విగ్గణంబు లిట్లనిరి.
టీకా:
ఆ = ఆ; నళినాయతాక్షుని = నారాయణునిని {నళినాయతాక్షుడు - నళిని (కమలముల) ఆయత (వలె విశాలమైన) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; అనంత = అనంతమైన; పరాక్రమ = పరాక్రమములు; దుర్నిరీక్ష్య = చూచుటకు వీలుకాని; తేజస్ = తేజస్సుచేత; నిహత = బాగా కొట్టబడిన; స్వ = తమ; దీప్తిలు = కాంతులు కలవారు; అగుచున్ = అవుతూ; నుతి = స్తుతుల; చేయన్ = చేయుటకు; అశక్తులు = శక్తిలేనివారు; ఐ = అయ్యి; భయ = భయము; గ్లాని = దౌర్భల్యములను; వహించి = చెంది; బాష్పములు = కన్నీరు; క్రమ్మగ = కమ్ముకొనగ; గద్గద = బొంగురుపోయిన; కంఠులు = కంఠములు కలవారు; ఐ = అయ్యి; తనుల్ = దేహములు; మ్రానుపడంగ = నిశ్చెష్టితములుకాగ; ఆ = ఆ; విభున్ = ప్రభువు; మన్ననన్ = అనుగ్రహములను; కైకొని = స్వీకరించి; ఎట్టకేలకున్ = చివరికి. నిటలతట = నుదిటిపై; ఘటిత = హత్తించిన; కరపుటులు = జోడించినచేతులు కలవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముని; అపార = అంతులేని; మహిమన్ = మహిమను; ఎఱిగి = తెలిసి; నుతియింప = స్తుతించుటకు; శక్తులు = సామర్థ్యముల కలవారు; కాక = కాకపోయి; ఉండియున్ = ఉండినప్పటికిని; కృత = చేసిన; అనుగ్రహ = అనుగ్రహముల; విగ్రహుండు = విస్తారముగ కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; తమతమ = ఎవరికివారు వారి; మతుల్ = మనసున; కున్ = కు; గోచరించిన = కనిపించిన; కొలంది = వరకు; నుతియింపన్ = స్తుతియింప; తొడగిరి = మొదలిడిరి; అందున్ = వారిలో; గృహీతంబులు = స్వీకరించిన; అగు = అయిన; పూజ = పూజ; ఆది = మొదలగు; ఉపచారంబులు = సేవలు; కలిగి = కలిగుండి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలైనవారి; కున్ = కి; జనకుండును = తండ్రి, సృష్టికారణుండు; సునంద = సునందుడు; నంద = నందుడు; ఆది = మొదలైన; పరమ = అత్యుత్తమ; భాగవత = బాగవతులచే; సేవితుండును = సేవింపబడువాడు; యజ్ఞ = యజ్ఞములకు; ఈశ్వరుండు = ప్రభువును; అగు = అయిన; భగవంతుని = విష్ణుమూర్తిని; శరణ్యునిన్ = శరణువేడదగినవాడు; కాన్ = అగునట్లు; తలంచి = అనుకొని; దక్షుండు = దక్షుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; దేవా = భగవంతుడా; నీవు = నీవు; స్వ = స్వంత; స్వరూపంబున్ = స్వరూపములో; ఉన్నయప్పుడు = ఉన్నప్పుడు; ఉపరతంబులు = ఉడిగినవి; కాని = కానట్టి; రాగ = రాగము; ఆది = మొదలైన; అఖిల = సమస్తమైన; బుద్ధి = బుద్ధి యొక్క; అవస్థల = స్థితులు; చే = చేతను; విముక్తుండవును = విడువబడినవాడవు; అద్వితీయుండవును = సాటిలేనివాడవు; చిద్రూపకుండవును = చైతన్యస్వరూపుడవు; భయ = భయము; విరహితుండవును = అసలులేనివాడవు; ఐ = అయ్యి; మాయన్ = మాయను; తిరస్కరించి = తిరస్కరించి; మఱియును = ఇంకను; ఆ = ఆ; మాయను = మాయను; అనుసరించుచు = అనుసరిస్తూ; లీలా = లీలగాధరించిన; మానుష = మానవుల; రూపంబులనన్ = రూపములను; అంగీకరించి = స్వీకరించి; స్వతంత్రుడవు = స్వతంత్రుడవు; అయ్యును = అయినప్పటికిని; మాయా = మయకు; పరతంత్రుడవు = లొంగినవాడవు; ఐ = అయ్యి; రాగ = రాగము; ఆది = మొదలైనవానితో; యుక్తుండవున్ = కూడినవాని; పోలెన్ = వలె; రామ = రాముడు; కృష్ణ = కృష్ణుడు; ఆది = మొదలగు; అవతారంబులన్ = వతారములలో; కానంబడుచున్ = కనబడుతూ; ఉందువు = ఉండెదవు; కావున = అందుచేత; ఈ = ఈ; లోకంబులు = లోకముల; కున్ = కు; నీవ = నీవే; ఈశ్వరుండవు = ప్రభువు; అనియు = అని; ఇతరులు = మిగతావారు; ఐన = అయిన; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ఆదులు = మొదలైనవారు; భవత్ = నీ యొక్క; మాయా = మాయ యొక్క; విభూతులు = వైభవములు, జనించినవారు; అగుటన్ = అగుట; చేసి = వలన; లొకంబుల్ = లోకముల; కున్ = కు; ఈశ్వరులు = ప్రభువులు; కారు = కారు; అనియును = అని; భేద = వైవనస్య; దృష్టి = దృక్పదము; కల = కల; నన్ను = నన్ను; రక్షింపుము = కాపాడుము; ఈ = ఈ; విశ్వ = విశ్వమునకు; కారణులు = హేతువులు; ఐన = అయిన; ఫాలలోచనుండును = శివుడు {ఫాలలోచనుడు - ఫాలము (నుదురు) యందు లోచనుండు (కన్నులు కలవాడు), శివుడు}; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; దిక్పాలురును = దిక్పాలకులును {దిక్పాలకులు - అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుచు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు}; సకల = సమస్తమైన; చర = చలనము కల; అచర = చలనము లేని; జంతువులును = జీవులును; నీవ = నీవే; భవత్ = నీకంటె; వ్యతిరిక్తంబు = వేరైనది; జగంబునన్ = లోకమున; లేదు = లేదు; అని = అని; విన్నవించిన = మనవిచేసిన; తదనంతరంబ = తరువాత; ఋత్విక్ = ఋత్విక్కుల; గణంబులు = సమూహములు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:
ఆ విష్ణుమూర్తి అఖండమైన పరాక్రమం వల్ల, తేరిచూడరాని తేజస్సు వల్ల దేవతలు నిర్ఘాంతపోతూ ఆయనను స్తుతించడానికి అశక్తులైనారు. భయకంపితులై కన్నీరు కారుస్తూ డగ్గుత్తికతో నిశ్చేష్టులై నిలబడి ఎట్టకేలకు కమాలాక్షుని కటాక్షం పొంది... దేవతలు నుదుట చేతులు ఉంచుకొని ఆ మహాత్ముని మహిమను తెలుసుకొని స్తుతించటానికి అసమర్థులైనప్పటికీ ఆయన అనుగ్రహాన్ని పొంది, తమకు చేతనయినట్లు కొనియాడసాగారు. భక్తుల పూజలు పరిగ్రహించేవాడు, బ్రహ్మాదులకు జనకుడు, సునందుడు నందుడు మొదలైన పరమ భక్తులచేత సేవింపబడేవాడు, యజ్ఞేశ్వరుడు అయిన భగవంతుణ్ణి రక్షకుడుగా భావించి దక్షుడు ఇలా స్తుతించాడు. “దేవా! నీవు స్వరూపంతో ఉన్నప్పుడు రాగద్వేషాలు లేని అద్వితీయుడవు, చిద్రూపుడవు, నిర్భయుడవు. ఒకసారి మాయను నిరసిస్తావు. ఒక్కొకసారి దానిని అనుసరిస్తావు. లీలామానుష రూపాలను ధరిస్తావు. నీవు స్వతంత్రుడవు. అయినా మాయకు లొంగి రాగాదులు ఉన్నవాని వలె రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలను ధరించి దర్శనమిస్తావు. ఈ లోకానికి నీవే ప్రభుడవని, తక్కిన బ్రహ్మరుద్రాదులు నీ మాయా వైభవ మూర్తులని, అందువల్ల లోకాలకు ప్రభువులు కారని, భేదదృష్టితో ఉన్న నన్ను మన్నించు. ఈ విశ్వాసానికి హేతువులైన శివుడు, బ్రహ్మ, దిక్పాలకులు, సకల చరాచర జీవకోటి అన్నీ నీవే. నీకంటె వేరయినది ఈ విశ్వంలో లేదు” అని దక్షుడు విన్నవించిన తరువాత ఋత్విక్కులు ఇలా అన్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=170
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment