Saturday, July 8, 2017

దక్ష యాగము - 82:

4-177-మ.
"అరవిందోదర! తావకీన ఘన మాయామోహితస్వాంతులై
పరమంబైన భవన్మహామహిమముం బాటించి కానంగ నో
పరు బ్రహ్మాది శరీరు లజ్ఞులయి; యో పద్మాక్ష! భక్తార్తిసం
హరణాలోకన! నన్నుఁ గావఁదగు నిత్యానందసంధాయివై."
4-178-వ.
బ్రహ్మ యిట్లనియె.

టీకా:
అరవిందోదర = నారాయణ {అరవిందోదర - అరవిందము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; తావకీన = నీ యొక్క; ఘన = గొప్ప; మాయ = మాయచే; మోహిత = మోహములో పడిన; స్వాంతులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; పరమంబు = గొప్పది; ఐన = అయిన; భవత్ = నీయొక్క; మహా = గొప్ప; మహిమమున్ = మహిమమును; పాటించి = విచారించియు; కానంగన్ = తెలిసికొన; ఓపరు = సమర్థులుకారు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; శరీరులు = దేహములు కలవారు; అజ్ఞులు = అజ్ఞానులు; అయి = అయ్యి; ఓ = ఓ; పద్మాక్ష = నారయణ {పద్మాక్ష - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; భక్తార్తిసంహరణాలోకన = నారాయణ {భక్తార్తిసంహరణాలోకన - భక్తుల ఆర్తి (బాధలను) సంహరణ (నాశము) చేయుటకు ఆలోకన (చూసెడివాడు), విష్ణువు}; నన్ను = నన్ను; కావదగు = కాపాడుము; నిత్యానందసంధాయివి = నారాయణుడవు {నిత్యానందసంధాయి - నిత్యమైన ఆనందమును కూర్చెడివాడు, విష్ణువు}; ఐ = అయ్యి. బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇట్లు = ఈవిధముగ; అనియె = పలికెను.

భావము:
“పద్మనాభా! నీ మాయకు చిక్కి బ్రహ్మ మొదలైన శరీరధారులు కూడా నీ మహామహిమను గ్రహింపలేరు. కమలనయనా! భక్తుల బాధలను తొలగించే చూపులు కలవాడా! నాకు నిత్యానందాన్ని ప్రసాదించి నన్ను కాపాడు.” బ్రహ్మ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=177

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: