Sunday, July 9, 2017

దక్ష యాగము - 83:

4-179-సీ.
"తవిలి పదార్థభేదగ్రాహకము లైన; 
చక్షురింద్రియముల సరవిఁ జూడఁ
గలుగు నీ రూపంబు గడఁగి మాయామయం; 
బగు; నసద్వ్యతిరిక్త మగుచు మఱియు 
జ్ఞానార్థ కారణ సత్త్వాది గుణముల; 
కాశ్రయభూతమై యలరుచున్న
నిరుపమాకారంబు నీకు విలక్షణ; 
మై యుండు ననుచు నే నాత్మఁ దలఁతు
4-179.1-తే.
నిర్వికార! నిరంజన! నిష్కళంక! 
నిరతిశయ! నిష్క్రియారంభ! నిర్మలాత్మ! 
విశ్వసంబోధ్య! నిరవద్య! వేదవేద్య! 
ప్రవిమలానంద! సంసారభయవిదూర!

టీకా:
తవిలి = పూని; పదార్థ = పదార్థముల; భేద = భేదములను; గ్రాహకములు = గ్రహించగలవి; ఐన = అయిన; చక్షురింద్రియములు = కన్నులు; సరవిన్ = క్రమముగ; చూడగలుగు = చూడగలుగు; నీ = నీ యొక్క; రూపంబున్ = రూపమును; కడగి = పూని; మాయా = మాయతో; మయంబున్ = నిండినది; అసత్ = అసత్యమునకు; వ్యతిరేకము = కానిది; అగుచున్ = అవుతూ; మఱియున్ = ఇంకను; జ్ఞాన = జ్ఞానము యొక్క; అర్థ = ప్రయోజనములకు; కారణ = కారణమైన; సత్త్వాది = సత్త్వము మొదలు {సత్త్వాది - సత్త్వ రజస్తమో గుణములు అనెడి త్రిగుణములు}; గుణముల్ = గుణముల; కున్ = కు; ఆశ్రయభూతము = ఆధారము; ఐ = అయ్యి; అలరుచున్న = విలసిల్లుతున్న; నిరుపమ = పోల్చదగినవి ఏమిలేని; ఆకారంబున్ = ఆకారము; నీకున్ = నీకు; విలక్షణము = ప్రత్యేకత; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అనుచున్ = అంటూ; నేను = నేను; ఆత్మన్ = మనసులో; తలతున్ = అనుకొనెదను. నిర్వికార = నారాయణ {నిర్వికార - మార్పులు లేని వాడు, విష్ణువు}; నిరంజన = నారాయణ {నిరంజన - కంటికి పొరలులేనివాడు, విష్ణువు}; నిష్కళంక = నారాయణ {నిష్కళంక, కళంకములు లేనివాడు, విష్ణువు}; నిరతిశయ = నారాయణ {నిరతిశయ - మించినది లేనివాడు, విష్ణువు}; నిష్క్రియారంభ = నారాయణ {నిష్క్రియారంభ - క్రియలందు సంకల్పములు లేనివాడు, విష్ణువు}; నిర్మలాత్మ = నారాయణ {నిర్మలాత్మ - పరిశుద్దమైన ఆత్మ కలవాడు, విష్ణువు}; విశ్వసంబోధ్య = నారాయణ {విశ్వసంబోధ్య - విశ్వ (లోకమునకు) సంబోధ్య (మేల్కొలుపువాడు), విష్ణువు}; నిరవద్య = నారాయణ {నిరవద్య - వంకలు పెట్టుటకురానివాడు, విష్ణువు}; వేదవేద్య = నారాయణ {వేదవేద్య - వేదములచే వేద్య (తెలియువాడు), విష్ణువు}; ప్రవిమలానంద = నారాయణ {ప్రవిమలానంద - మిక్కిలి నిర్మలమైన ఆనందమైనవాడు, విష్ణువు}; సంసారభయవిదూర = నారాయణ {సంసారభయవిదూర - సంసారము యొక్క భయమును బాగా దూరముచేయువాడు, విష్ణువు}.

భావము:
“పదార్థ భేదాలను మాత్రమే గ్రహించే నేత్రాలనే ఇంద్రియాలతో పురుషుడు నీ మాయాస్వరూపాన్ని మాత్రమే చూడగలడు. సంపూర్ణమై, జ్ఞానార్థాలకు సత్త్వం మొదలైన గుణాలకు నెలవై అసత్తుల కంటె వేరై, సాటి లేనిదై, విలక్షణమైన నీ రూపాన్ని జీవులు చూడలేరు. నీవు నిర్వికారుడవు. నిరంజనుడవు. నిష్కళంకుడవు. సర్వేశ్వరుడవు. క్రియారహితుడవు. విమలాత్ముడవు. విశ్వవిధాతవు. నిరవద్యుడవు. వేదవేద్యుడవు. ఆనందస్వరూపుడవు. భవబంధాలను పటాపంచలు చేసేవాడవు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=179

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: