Thursday, July 27, 2017

శ్రీకృష్ణ జననం - 1:

10.1-20-సీ.
ఆ శూరసేనున కాత్మజుం డగు వసు; 
దేవుఁ డా పురి నొక్క దినమునందు
దేవకిఁ బెండ్లియై దేవకియును దానుఁ; 
గడువేడ్క రథమెక్కి కదలువేళ
నుగ్రసేనుని పుత్రుఁ డుల్లాసి కంసుండు; 
చెల్లెలు మఱఁదియు నుల్లసిల్ల
హరుల పగ్గములఁ జేనంది రొప్పఁ దొడంగె; 
ముందట భేరులు మురజములును
10.1-20.1-ఆ.
శంఖ పటహములును జడిగొని మ్రోయంగఁ
గూఁతుతోఁడి వేడ్క కొనలుసాఁగ
దేవకుండు సుతకు దేవకీదేవికి
నరణ మీఁ దలంచి యాదరించి.
10.1-21-వ.
సార్థంబు లయిన రథంబుల వేయునెనమన్నూటిని, గనకదామ సముత్తంగంబు లయిన మాతంగంబుల నన్నూటిని, బదివేల తురంగంబులను, విలాసవతు లయిన దాసీజనంబుల నిన్నూటి నిచ్చి, యనిచినం గదలి వరవధూయుగళంబు తెరువునం జను సమయంబున.

భావము:
శూరసేనుడి కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెండ్లి చేసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలు మీద ప్రేమతో తానే స్వయంగా గుఱ్ఱాల పగ్గాలుపట్టి రథం తోలసాగాడు. అది చూసి దేవకీవసుదేవులు చాలా సంతోషించారు. రథం ముందు భేరీలూ మృదంగాలు శంఖాలు డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతూ ఉన్నాయి. దేవకికి తండ్రి అయిన దేవకుడు కుమార్తెపై ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలని అనుకొని. సకల పరికరాలతో కూడిన పద్దెనిమిదివందల రథాలను; బంగారు గొలుసులతో అలంకరించిన నాలుగువందల ఎత్తైన ఏనుగులను; పదివేల గుఱ్ఱాలనూ; రెండువందలమంది విలాసవతులైన పరిచారికలను ఆమెకు అరణంగా ఇచ్చాడు. క్రొత్త దంపతులైన దేవకీవసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరారు. ఆ సమయంలో. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=3&padyam=20

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: