4-185-మ.
"అనఘా! మాధవ! నీవు మావలెనె కర్మారంభివై యుండియున్
విను తత్కర్మ ఫలంబు నొంద; వితరుల్ విశ్వంబునన్ భూతికై
యనయంబున్ భజియించు నిందిర గరం బర్థిన్ నినుం జేరఁ గై
కొన; వే మందుము నీ చరిత్రమునకున్ గోవింద! పద్మోదరా!"
4-186-వ.
సిద్ధు లిట్లనిరి.
టీకా:
అనఘా = పుణ్యుడ; మాధవ = హరి; నీవు = నీవు; మా = మా; వలెనె = లానే; కర్మా = కర్మను; ఆరంభివి = సంకల్పించెడివాడవు; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికిని; విను = వినుము; తత్ = ఆ; కర్మ = కర్మ యొక్క; ఫలంబున్ = ఫలితమును; ఒందవు = పొందవు; ఇతరుల్ = ఇతరులు; విశ్వంబునన్ = లోకమున; భూతి = ఐశ్వర్యము; కై = కోసము; అనయంబున్ = ఎల్లప్పుడు; భజియించు = పూజించు; ఇందిర = లక్ష్మీదేవి; కరంబున్ = మిక్కిలిగ; అర్థిన్ = కోరి; నినున్ = నిన్ను; చేరన్ = చేరగ; కైకొనవు = చేపట్టవు; ఏమి = ఏమి; అందుము = అనెదము; నీ = నీ యొక్క; చరిత్రమున్ = వర్తనమున; కున్ = కు; గోవింద = నారాయణ; పద్మోదర = నారాయణ. సిద్దులు = సిద్ధులు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి.
భావము:
“పుణ్యాత్మా! మాధవా! నీవు మాలాగే కర్మలు చేసినా ఆ కర్మఫలం నిన్ను పొందదు. సంపదలకోసం లోకులు సేవించే లక్ష్మీదేవి ఎంతో ప్రీతితో నిన్ను వరించి దరి చేరినప్పటికీ ఆమెను ఆదరించవు. గోవిందా! కమలనాభా! నీ చరిత్రను వర్ణించడం మాకు సాధ్యమా?” సిద్ధులు ఇలా అన్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=185
:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::
No comments:
Post a Comment