Saturday, July 22, 2017

దక్ష యాగము - 96

4-204-వ.
బ్రాహ్మణజనంబు లిట్లనిరి "దేవా! యీ క్రతువును, హవ్యంబును, నగ్నియు, మంత్రంబులును, సమిద్దర్భాపాత్రంబులును, సదస్యులును, ఋత్విక్కులును, దంపతులును, దేవతలును, నగ్నిహోత్రంబులును, స్వధయు, సోమంబును, నాజ్యంబును, బశువును నీవ; నీవు దొల్లి వేదమయ సూకరాకారంబు ధరియించి దంష్ట్రాదండంబున వారణేంద్రంబు నళినంబు ధరియించు చందంబున రసాతలగత యైన భూమి నెత్తితివి; అట్టి యోగిజనస్తుత్యుండవును, యజ్ఞక్రతురూపకుండవును నైన నీవు పరిభ్రష్టకర్ములమై యాకాంక్షించు మాకుం బ్రసన్నుండ వగుము; భవదీయ నామకీర్తనంబుల సకల యజ్ఞ విఘ్నంబులు నాశంబునొందు; నట్టి నీకు నమస్కరింతుము."
4-205-క.
అని తన్ను సకల జనములు
వినుతించిన హరి భవుండు విఘ్నము గావిం
చిన యా దక్షుని యజ్ఞము
ఘనముగఁ జెల్లించెఁ గొఱఁత గాకుండంగన్.
4-206-క.
సకలాత్ముఁడు దా నగుటను
సకల హవిర్భోక్త యయ్యు జలజాక్షుండుం
బ్రకటస్వభాగమున న
య్యకళంకుఁడు తృప్తిఁ బొంది యనె దక్షునితోన్.

టీకా:
బ్రాహ్మణ = బ్రాహ్మణులు యైన; జనులు = వారు; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; దేవా = భగవంతుడ; ఈ = ఈ; క్రతువును = యజ్ఞమును; హవ్యంబును = హవ్యము; అగ్నియు = అగ్ని; మంత్రంబులును = మంత్రములు; సమ = చక్కటి; ఇద్ధ = ప్రసిద్దమైన; దర్భా = దర్భలు; పాత్రంబులును = పాత్రలును; సదస్యులును = సదస్యులును; ఋత్విక్కులును = ఋత్విక్కులు; దంపతులును = యజమాన దంపతులు; దేవతలును = దేవతలు; అగ్నిహోత్రంబులును = అగ్నిహోత్రములు; స్వధయు = స్వధ {స్వధ - తనను తాను ధరించి పోషించునది, పితృదేవతల ఆహారము}; సోమంబును = సోమరసము; ఆజ్యంబును = నెయ్యి; పశువును = బలిపశువు; నీవ = నీవే; నీవు = నీవు; తొల్లి = పూర్వము; వేద = వేదముతో; మయ = నిండిన; సూకర = వరాహ; ఆకారంబు = రూపము; ధరియించి = ధరించి; దంష్ట్రా = కోరలు అనెడి; దండంబునన్ = కర్రలతో; వారణ = ఏనుగులలో; ఇంద్రంబున్ = శ్రేష్టమైనది; నళినంబున్ = తామరపూలను; ధరియించు = ధరించు; చందంబునన్ = విధముగ; రసాతల = రసాతలము, పాతాళము నకు; గత = పోయినది; ఐన = అయిన; భూమిని = భూమిని; ఎత్తితివి = ఎత్తావు; అట్టి = అటువంటి; యోగి = యోగులైన; జన = వారిచేత; స్తుత్యుండవును = స్తుతింపబడువాడవు; యజ్ఞ = యజ్ఞము యందలి; క్రతు = కర్మముల; రూపుండవు = రూపముకలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; పరిభ్రష్ట = మిక్కిలిచెడ్డ; కర్ములము = పనులుచేయువారము; ఐ = అయ్యి; ఆకాంక్షించు = కోరుతున్న; మాకున్ = మాకు; ప్రసన్నుండవు = దయకలవాడవు; అగుము = అగుము; భవదీయ = నీ యొక్క; నామ = నామములను; సంకీర్తనంబులన్ = చక్కగాకీర్తించుటవలన; సకల = సమస్తమైన; యజ్ఞ = యజ్ఞముయొక్క; విఘ్నంబులు = ఆటంకములు; నాశంబున్ = నాశనమును; ఒందున్ = పొందును; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; నమస్కరింతుము = నమస్కరించెదము. అని = అని; తన్నున్ = తనను; సకల = సమస్తమైన; జనములున్ = వారు; వినుతించినన్ = విజ్ఞప్తిచేయగ; హరి = నారాయణుడు; భవుండు = శివుడు; విఘ్నమున్ = అంతరాయము; కావించిన = కలిగించిన; ఆ = ఆ; దక్షుని = దక్షుని; యజ్ఞము = యాగమును; ఘనముగన్ = గొప్పగ; చెల్లించెన్ = పూర్తిచేయించెను; కొఱత = కొరత; కాకుండగన్ = లేకుండగా. సకల = సమస్తమును; ఆత్ముడు = తానైనవాడు; తాన్ = తాను; అగుటను = అగుటచేత; సకల = సమస్త; హవిస్ = హవిస్సులకు; భోక్త = భుజించువాడు; అయ్యున్ = అయినప్పటికిని; జలజాక్షుండు = హరి {జలజాక్షుడు - జలజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; ప్రకటన్ = ప్రసిద్దముగ; స్వ = తన; భాగమునను = భాగముతోనే; ఆ = ఆ; అకళంకుడు = మచ్చలేనివాడు; తృప్తిన్ = సంతృప్తిని; పొంది = పొంది; అనె = అనెను; దక్షుని = దక్షుని; తోన్ = తోటి.

భావము:
బ్రాహ్మణులు ఇలా అన్నారు. “దేవా! ఈ యజ్ఞం, ఇందులోని హవ్యం, అగ్ని, మంత్రాలు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రాలు, స్వధ, సోమరసం, నెయ్యి, యజ్ఞపశువు - అన్నీ నీవే. నీవు పూర్వం వేదస్వరూపమైన ఆదివరాహరూపం ధరించి, ఏనుగు తన దంతంతో పద్మాన్ని పైకి ఎత్తినట్లు నీ కోరకొనతో పాతాళంనుండి భూమిని పైకి లేవనెత్తావు. యోగులు నిన్ను స్తుతిస్తారు. నీవు యజ్ఞస్వరూపుడవు. వేదకర్మలు ఆచరింపక భ్రష్టులమైన మాపై దయ చూపు. నీ నామాన్ని సంస్తుతిస్తే యజ్ఞాలలో సంప్రాప్తించే సమస్త విఘ్నాలు సమసిపోతాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాము. అని ఈ విధంగా సమస్త జనులూ తనను స్తుతించగా విష్ణుమూర్తి ప్రసన్నుడై శివుడు ధ్వంసం చేసిన దక్షుని యజ్ఞాన్ని ఏ కొరత లేకుండ చక్కగా పూర్తి చేయించాడు. తాను సకలాంతర్యామియై సకల హవిస్సులను భుజించేవాడై కూడ తన భాగమైన ‘త్రికపాల పురోడాశం’ మంత్రంతోనే తృప్తిపడి దక్షునితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=9&padyam=206

:: చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం ::

No comments: