74- వ.
అని
యొండొరులఁ దెలుపుకొని, రోషంబులు హృదయంబుల నిలుపుకొని, సంరంభించి, తనుత్రాణంబులు వహించి, ధనురాది సాధనంబులు ధరియించి, పంతంబులాడి, తమతమ చతురంగ బలంబులంగూడి, జరాసంధాదులు యదువీరుల
వెంటనంటఁ దాఁకి, నిలునిలు మని ధిక్కరించి పలికి, యుక్కుమిగిలి, మహీధరంబుల మీఁద సలిల ధారలు కురియు ధారాధరంబుల
చందంబున బాణ వర్షంబులు గురియించిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబు లెక్కిడి,
గుణంబులు మ్రోయించి; రప్పుడు.
అలా కృష్ణుడు రుక్మిణిని
తీసుకుపోతుంటే, శశిపాలాదులు ఒకరికొకరు హెచ్చరించుకొని, రోషాలు పెంచుకొన్నారు.
కవచాలు, బాణాలు, ఆయుధాలు ధరించారు. జరాసంధుడు మొదలైనవారంతా పంతాలేసుకొని తమతమ చతురంగ
సైన్యాలతో యాదవుల వెంటబడ్డారు. “ఆగక్కడ ఆగక్కడ” అని హుంకరించారు. మేఘాలు కొండలమీద కురిపించే వానధారల్లా బాణ వర్షాలు
కురిపించారు. యాదవ సేనానాయకులు విల్లులెక్కుపెట్టి, వింటి తాళ్ళు మోగించారు.
అని = అని; ఒండొరులన్ = ఒకరికొకరు; తెలుపుకొని = చెప్పుకొని; రోషంబులు = పౌరుషములు; హృదయంబులన్ = మనసులలో; నిలుపుకొని = ఉంచుకొని; సంరంభించి = ఆటోపించి; తనుత్రాణంబులున్ = కవచములను; వహించి = ధరించి; ధనుః = ధనుస్సు; ఆది = మొదలగు; సాధనంబులున్ = ఆయుధములు; ధరియించి = ధరించి; పంతంబులు = బింకములు; ఆడి = పలుకుచు; తమతమ = వారివారి; చతురంగబలంబులన్ = చతురంగ సైన్యముల; కూడి = తో కలిసి; జరాసంధ = జరాసంధుడు; ఆదులు = మున్నగువారు; యదు = యాదవ; వీరుల = సైనికుల; వెంటన్ = వెంబడి; అంటదాకి = దరిచేరి; నిలునిలుము = ఆగిపొండి; అని = అని; ధిక్కరించి = గద్దించి; పలికి = కేకలువేసి; ఉక్కుమిగిలి = విజృంభించి; మహీధరంబులన్ = కొండల {మహీధరంబులు - నేలను ధరించునవి, కొండలు}; మీదన్ = పైన; సలిల = నీటి; ధారలు = జల్లులు; కురియు = వర్షించు; ధారాధరంబులు = మేఘముల {ధారాధరంబులు - నీటిధారలను కలిగి ఉండునవి,
మేఘములు}; చందంబునన్ = వలె; బాణ = బాణముల; వర్షంబులున్ = వానలను; కురియించినిన్ = కురిపించగా; యాదవ = యాదవుల; సేనలన్ = సైన్యములలో; కల = ఉన్న; దండనాయకులు = సేనానాయకులు; కోదండంబులు = విల్లులను;
ఎక్కిడి = ఎక్కపెట్టి; గుణంబులున్ =
అల్లెతాడులను; మ్రోయించిరి = టంకారములు చేయించిరి; అప్పుడు = ఆ సమయము నందు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం:
: