( బాణాసురునితో యుద్ధంబు )
10.2-396-సీ.
బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖ యదు;
వృష్ణి భోజాంధక వీరవరులు
దుర్వార పరిపంథి గర్వ భేదన కళా;
చతురబాహాబలోత్సాహలీల
వారణ స్యందన వాజి సందోహంబు;
సవరణ సేయించి సంభ్రమమున
సముచిత ప్రస్థాన చటుల భేరీ భూరి;
ఘోష మంభోనిధి ఘోష మఁడఁప
10.2-396.1-తే.
ద్వాదశాక్షౌహిణీ బలోత్కరము లోలి
నడచెఁ గృష్ణునిరథము వెన్నంటి చెలఁగి
పృథులగతి మున్ భగీరథు రథము వెనుక
ననుగమించు వియన్నది ననుకరించి.
10.2-397-వ.
ఇవ్విధంబునం గదలి కతిపయప్రయాణంబుల శోణపురంబు సేరంజని వేలాలంఘనంబు సేసి యదువీరు లంత.
భావము:
బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ వీరులు, మదోన్మత్తులయిన శత్రువీరులను అణచివేయాలనే అఖండ బలోత్సాహాలతో చతురంగ బలాలను సమకూర్చుకుని యుద్ధభేరి మ్రోగించారు. ఆ భేరీల ధ్వని సముద్రఘోషను మించిపోయింది శ్రీకృష్ణుని రథం వెంట బయలుదేరిన పన్నెండు అక్షౌహిణుల సైన్యం భగీరథుడి వెంట బయలుదేరిన ఆకాశగంగా ప్రవాహంలా తోచింది. ఈ విధంగా పయనమైన యదువీరులు కొన్నాళ్ళకు శోణపురం చేరి, పొలిమేర దాటారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=36&padyam=396
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment