Sunday, June 7, 2020

ఉషా పరిణయం - 18

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-360-వ.
ఇవ్విధంబునం జూపిన.
10.2-361-మ.
వనితారత్నము కృష్ణనందనుని భావప్రౌఢిఁ దాఁ జూచి గ్ర
ద్దనఁ దన్నర్థి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో
ననుమానించి యనంతరంబ యనిరుద్ధాఖ్యున్ సరోజాక్షు నూ
తన చేతోభవమూర్తిఁ జూచి మది సంతాపించుచున్నిట్లనున్.
10.2-362-ఉ.
"ఇంతి! మదీయ మానధనమెల్ల హరించిన మ్రుచ్చు నిమ్మెయిం
బంత మెలర్ప వ్రాసి పటభాగనిరూపితుఁ జేసినట్టి నీ
యంతటి పుణ్యమూర్తిఁ గొనియాడఁగ నేర్తునె? నీ చరిత్రముల్‌
వింతలె నాకు? నీ మహిత వీరుకులంబు బలంబుఁ జెప్పుమా! "
10.2-363-చ.
అనవుడుఁ జిత్రరేఖ జలజాక్షికి నిట్లను "నీ కుమారకుం
డనఘుఁడు, యాదవాన్వయ సుధాంబుధి పూర్ణసుధాకరుండునాఁ
దనరిన కృష్ణపౌత్త్రకుఁ, డుదారచరిత్రుఁడు, భూరిసింహ సం
హననుఁ, డరాతి సైన్య తిమిరార్కుఁడు, పే రనిరుద్ధుఁ డంగనా! "

భావము:
ఈలాగున చిత్రరేఖ యాదవవీరులను చూపించే సమయంలో ఆ బాలామణి కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని చూసి తనకు కలలో కనిపించినవాడు ఇతడే అని అనుమానించింది. కాని పిమ్మట చిత్రరేఖ చూపించిన పద్మనేత్రుడూ, నవమన్మథాకారుడూ అయిన అనిరుద్ధుడిని చూసి సంతోషంతో ఇలా పలికింది. “ఓ చెలీ! నా మానధనాన్ని కొల్లగొట్టిన దొంగ వీడె. నీవు ఇలా ఇతడిని చిత్రపటంలో చూపించిన పుణ్యమూర్తివి; నిన్ను ఏమని పొగడగలను చెప్పు. ఈ వీరాధివీరుడి బలాది విశేషములు వివరించు.” అని ఉషాసుందరి చిత్రరేఖను అడిగింది. ఆమె ఉషాసుందరికి ఆ సుకుమారుడి వివరాలు ఇలా తెలిపింది “సఖీ! ఇతడు యాదవవంశ నిండుచంద్రుడు; శ్రీకృష్ణుడి మనుమడు; ఉదారచరిత్రుడు; సింహపరాక్రముడు; శత్రుసైన్యం అనే చీకటి పాలిటి సూర్యుడు; ఇతని పేరు అనిరుద్ధుడు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=363

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: