( చిత్రరేఖ పటంబున చూపుట )
10.2-355-మ.
బలిమిన్ సర్వనృపాలురన్నదిమి కప్పంబుల్ దగం గొంచు ను
జ్జ్వల తేజో విభవాతిరేకమున భాస్వత్కీర్తి శోభిల్లఁగాఁ
బొలుపొందం దను రాజరా జన మహా భూరిప్రతాపంబులుం
గల దుర్యోధనుఁ జూడు సోదరయుతుం గంజాతపత్త్రేక్షణా! "
10.2-356-వ.
అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజవరుల నెల్లఁ జూపుచు యదువంశసంభవులైన శూరసేన వసుదేవోద్ధవాదులం జూపి మఱియును.
10.2-357-ఉ.
"శారద నీరదాబ్జ ఘనసార సుధాకర కాశ చంద్రికా
సార పటీరవర్ణు, యదుసత్తము, నుత్తమనాయకుం, బ్రమ
త్తారి నృపాల కానన హుతాశనమూర్తిఁ, బ్రలంబదైత్య సం
హారునిఁ, గామపాలుని, హలాయుధుఁ జూడుము దైత్యనందనా!
భావము:
ఓ కమలాక్షీ! ఇతడు సోదరులతో ఉన్న సుయోధనుడు; గొప్పపరాక్రమవంతుడు; తేజోనిధి; రారాజు అని ప్రశస్తి గాంచినవాడు; తన మహాశౌర్యంతో రాజులను అందరినీ ఓడించి, వారిచే కప్పములను గైకొనుచున్నాడు; అఖండకీర్తిమంతుడు." ఈ విధంగా ఉషాబాలకు సమస్త రాజులను చూపిస్తూ చిత్రరేఖ, యాదవవంశస్థులైన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైనవారిని కూడా చూపించింది. “ఓ దైత్య బాలికా! ఉషా! శరత్కాల మేఘం, శంఖం, ఘనసారం, చంద్రుడు, చందనం వంటి వర్ణంతో శోభిస్తున్న ఈ వీరుడు బలరాముడు; ఇతడు ఉత్తమ నాయకుడు; ప్రమత్తులైన శత్రురాజులు అనే అరణ్యాల పాలిట అగ్నిదేవుని వంటివాడు; ప్రలంబుడనే దైత్యుని సంహరించిన మహావీరుడు; కామపాలుడు; ఇతడే హలాయుధుడు అయిన యదువంశశేఖరుడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=357
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment